ఒక్కో హెల్త్హబ్కు 30 నుంచి 50 ఎకరాలు
వీటిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసేవారికి ఉచితంగా అయిదేసి ఎకరాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో టీకా తయారయ్యేలా చర్యలు
బ్లాక్‌ఫంగస్ మందుల కోసం కంపెనీలతో మాట్లాడండి
కొవిడ్ నియంత్రణపై సమీక్షలో సీఎం జగన్
అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం, నగరపాలికల్లో ప్రత్యేకంగా హెల్త్‌హబ్‌లు ఏర్పాటుచేసి వాటిలో మల్టీ, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చేలా చూస్తే ఇక్కడే మెరుగైన వైద్యం లభిస్తుంది. దీనిపై నెలలో పాలసీ తీసుకురావాలి.
రాష్ట్రంలోని 13 జిల్లాకేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్‌హబ్‌లు (ఆరోగ్య కూడళ్లు) ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొవిడ్-19 నియంత్రణ, నివారణ, టీకాలు, ఆక్సిజన్ సరఫరాపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలనిచ్చారు. హెల్త్‌హబ్‌ల కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని, ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ఐదెకరాల చొప్పున ఉచితంగా కేటాయించాలని సూచించారు. అయితే మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకే భూములనివ్వాలని నిర్దేశించారు. వీటన్నింటిలో కలిపి కనీసం 80 మల్టీ, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని.. వీటికితోడు 16 చోట్ల ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలు ఒక్కోటి చొప్పున వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలోని మంచి ఆసుపత్రులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద కూడా ఉత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టీకాలు తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని.. దీనిపైనా ఓ విధానం తీసుకురావాలని సూచించారు.

బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు చాలవు
రాష్ట్రంలో ఇప్పటికి 808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా 5,200 ఇంజక్షన్లు సమకూరాయని అధికారులు సీఎంకు వివరించారు. అవసరంలో ఇవి పది శాతం కూడా లేవని స్పష్టం చేశారు. కేసుల పెరుగుదలను పరిశీలిస్తే వచ్చే వారంలో కనీసం 40 వేల ఇంజక్షన్లు అవసరమవుతాయని.. ఇప్పుడున్నవి ఏమూలకు సరిపోవని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం నియంత్రణలో ఉన్న ఈ ఇంజక్షన్లను అవసరాలకు అనుగుణంగా కేటాయించడం లేదన్నారు. వైద్యపరంగా ప్రత్యామ్నాయ అవకాశాలపై పరిశీలించాలని, వాటికి సంబంధించిన మందులు ఎక్కడున్నా తెప్పించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సంబంధిత కంపెనీలతో సమన్వయం చేసుకొని మందులు వచ్చేలా చూడాలన్నారు.
సీఎం ఆదేశాలు మరికొన్ని..
* ఆసుపత్రుల్లో ప్రవేశాలు తగ్గినా.. ఆక్సిజన్ పైపులైన్లు, నిల్వలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి.
* ఏ సమయంలో కొవిడ్ విస్తరించినా పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధం కావాలి.
* ఆసుపత్రుల్లో ఐసీయూ, నాన్‌ఐసీయూ పడకల ఆధారంగా ఆక్సిజన్ సదుపాయాలపై కార్యాచరణ ఉండాలి. వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేస్తున్న పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ నుంచి ఈ పడకలకు ఆక్సిజన్ అందేలా చూడాలి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రత్యామ్నాయంగావాడుకోవాలి.
అనాథ పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్
* కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణించి అనాథలైన 78 మంది పిల్లలను ఇప్పటివరకు గుర్తించగా, వీరిలో పది మందికి ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వమిస్తున్న ఈ డబ్బులు సరైన పథకంలో డిపాజిట్ చేసేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుకు సంబంధించి సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చాక అన్ని అంశాలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
* నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటివరకు ఆసుపత్రులపై 66 ఫిర్యాదులు వచ్చాయని, వీటి ఆధారంగా 43 ఆసుపత్రులకు రూ.2.4 కోట్ల జరిమానా విధించామని అధికారులు తెలిపారు.

రికవరీ పెరుగుతోంది
ష్ట్రంలో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.
104కు వచ్చే కాల్స్‌కు స్పందిస్తున్నారా?
104 కాల్‌సెంటర్‌కు వస్తున్న అన్ని ఫిర్యాదులపైనా స్పందిస్తున్నారా? అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ప్రతి కాల్‌కు స్పందించి 3గంటల్లో పరిష్కారం చూపుతున్నామని అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కేసుల గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. 104కు వచ్చే కాల్స్ సంఖ్య మే 4న 19,175 ఉండగా, 27న 5,421 వచ్చాయని.. కేసుల తీవ్రత తగ్గిందనడానికి ఇది సంకేతమని అధికారులు పేర్కొన్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా 597 కొవిడ్ కేర్ ఆసుపత్రుల్లో 46,596 పడకలు ఉండగా 32,567 పడకలు నిండాయని అధికారులు వివరించారు. 116 కొవిడ్ కేర్ కేంద్రాల్లో 52,941 పడకలు ఉంటే 16,689 పడకలు నిండాయన్నారు. హోంఐసొలేషన్‌లో 1,37,436 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
- ఆక్సిజన్ సరఫరాకు 16 ఐఎస్వో కంటైనర్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. నాలుగు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ప్రాణవాయువు తీసుకొస్తున్నామన్నారు.
Source: https://www.eenadu.net/apmukyamshalu/mainnews/general/2501/121108454