యువతులను కాపాడిన దిశ యాప్

  • నరసరావుపేట నుంచి ఊరికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం టైర్‌ పంక్చర్‌
  • సాయం కోసం వేచి చూస్తుండగా ఇద్దరు ఆకతాయిల వేధింపులు
  • ‘దిశ’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయగానే స్పందించిన పోలీసులు

గుంటూరు జిల్లాలో దిశ యాప్‌ ఇద్దరు విద్యార్థినులను ఆకతాయిల బారి నుంచి కాపాడింది. నరసరావుపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం గోగులపాడుకు చెందిన ఇద్దరు యువతులు ఆదివారం సాయంత్రం నరసరావుపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఇక్కుర్రు గ్రామ శివారులో వారి ద్విచక్ర వాహనం టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరు ఆకతాయిలు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం ప్రారంభించారు.

దీంతో ఆ యువతులు దిశ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కారు. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్‌ ఎస్‌ఐ శ్రీహరి ఎనిమిది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఆదినారాయణ, బుజ్జిలను అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్లిప్‌ కార్ట్, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు రొంపిచర్ల ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు. వెంటనే స్పందించిన రూరల్‌ ఎస్‌ఐ శ్రీహరిని జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని, డీఎస్పీ విజయభాస్కర్, సీఐ అచ్చయ్య అభినందించారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/disha-app-protected-two-girls-within-minutes-andhra-pradesh-1399165