- నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంవోయూ
- ఐబీఎం, ఎస్పీఐ, ఎల్వీ ప్రసాద్ అకాడమీ, ఐటీడీసీల భాగస్వామ్యం
- గతంలో 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ఏపీఎస్ఎస్డీసీ
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము తెలిపారు. ఇటువంటి సంస్థల్లో శిక్షణ పొందే యువతకు ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెప్పారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)తో నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరాముతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మధుసూదనరెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్ ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మధుసూదనరెడ్డి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ, ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారని, ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటివరకు 13 సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపారు. అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ తాజాగా ఐబీఎం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, ఎస్పీఐ డైరెక్టర్ జార్జినా ఫువా, ఐటీడీసీ ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.