రహదారుల అభివృద్ధికి రూ.6,421 కోట్లు

    • రాష్ట్రంలో 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి
    • ఫలించిన సీఎం జగన్‌ కృషి

    రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి రూ.6,421 కోట్లు కేటాయించింది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రంలో 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులు కూడా సమకూర్చనుంది. రాష్ట్రాల్లో జాతీయ రహదారులను రెండు విధాలుగా అభివృద్ధి చేస్తారు. కొన్ని హైవేల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నేరుగా చేపడుతుంది.

    మరికొన్ని పనులను ఆర్‌ అండ్‌ బీ జాతీయ రహదారుల విభాగం కేంద్ర నిధులతో చేపడుతుంది. కాగా, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తూ వస్తోంది. దాంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాల్చడం లేదు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్‌ జగన్‌ ఈ అంశంపై దృష్టి సారించారు. వాస్తవానికి 2019–20లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేవలం రూ.269 కోట్లే కేటాయించింది. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ కేటాయింపులను రూ.269 కోట్ల నుంచి ఏకంగా రూ.1,830 కోట్లకు పెంచింది. అంతకంటే ఎక్కువగా 2020–21లో రాష్ట్రానికి రూ.2,702 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.6,421 కోట్లు కేటాయించడం విశేషం. కేంద్రం ప్రకటించిన వార్షిక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన ప్రణాళిక మేరకు త్వరలో పనులు చేపడతామని ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ‘సాక్షి’కి తెలిపారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/development-609-km-national-highways-ap-1367230