సీఎం జగన్‌ను కలిసిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు, ఫౌండర్ మెంబర్ జి.ప్రతిభారావు, చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి పప్పూరు
- కంటి చికిత్సకు ఏ ఒక్కరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదు
- తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని యాజమాన్యానికి ముఖ్యమంత్రి సూచన
- సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి బృందం అంగీకారం
- అన్ని అనాధ శరణాలయాల్లోని చిన్నారులకు ఉచితంగా నేత్రవైద్య పరీక్షలు, చికిత్స
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతో సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కంటి ఆస్పత్రి ఏర్పాటుకానుంది.
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు, వ్యవస్థాపక సభ్యుడు జి. ప్రతిభారావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెరిషియరీ కేర్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై ఆస్పత్రి యాజమాన్యం సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే.. రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఐ కేర్‌కు సంబంధించి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ముఖ్యమంత్రితో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపింది.
ఈ సందర్భంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో కంటి ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని.. అంధత్వ నివారణకు స్క్రీనింగ్ నుంచి సర్జరీ వరకూ అన్ని స్థాయిలలోనూ అత్యాధునిక వైద్యం ఇక్కడే అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేయాలని సీఎం జగన్ సూచించగా.. అందుకు ఆస్పత్రి యాజమాన్యం సంసిద్ధత తెలిపింది. అంతేకాక.. రాష్ట్రంలోని అన్ని అనాధ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్రవైద్య పరీక్షలు, చికిత్స ఉచితంగా చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఈ సమావేశంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి పప్పూరు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/lv-prasad-eye-hospital-team-agrees-ys-jagan-appeal-1408951