రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుముఖం

  • 2016లో 17.9 శాతం.. ఈ ఏడాది  అక్టోబర్‌లో 5.4 శాతం
  • వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత చేపట్టిన చర్యల ఫలితం
  • 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన వైఎస్‌ జగన్‌
  • వైద్య రంగంలోనూ పెద్ద ఎత్తున నియామకాలు
  • సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగం తగ్గుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే యువతకు ఉపాధిపై దృష్టి సారించారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వైద్య రంగంలోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నారు. వివిధ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక కూడా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు బాగా తగ్గినట్లు స్పష్టం చేసింది.

2016వ సంవత్సరంలో ఈ రేటు 17.9 శాతం ఉండగా గత నెల (అక్టోబర్‌)కు 12 శాతానికి పైగా తగ్గి, 5.4 శాతంగా నమోదైంది. అందులోనూ ఈ ఏడాది ప్రతి నెలా నిరుద్యోగ రేటు తగ్గుదల గణనీయంగా ఉంది. గత నెలలో జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు 7.75 శాతంగా ఉంది. అంటే జాతీయ స్థాయికంటే రాష్ట్రంలో 2.35 శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో అక్టోబర్‌ నాటికి నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. తెలంగాణలో 2016 జనవరిలో నిరుద్యోగ రేటు 7.4 శాతంగా ఉందని తెలిపింది.

అగ్రస్థానంలో హరియాణా 
నిరుద్యోగంలో హరియాణా అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగ రేటు ఎక్కువ శాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా(30.7%), రాజస్థాన్‌(29.6%), జమ్మూకశ్మీర్‌ (22.2 %), ఝార్ఖండ్‌ (18.1%), హిమాచల్‌ప్రదేశ్‌ (14.1%), బిహార్‌ (13.9%), గోవా (11.7%), పంజాబ్‌ (11.4%), ఢిల్లీ (11 %), సిక్కిం (10%), త్రిపుర (9.9 %)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/unemployment-declining-andhra-pradesh-1409232