రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలు ,కళాశాలల ఏర్పాటు

    రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య కళాశాలల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నైపుణ్య విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 21 చోట్ల ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తికాగా, త్వరలో టెండర్లు పిలవడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఒక్కో నైపుణ్య కళాశాలను కనీసం 5 ఎకరాల్లో రూ. 40 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 30 కళాశాలలకు రూ. 1,200 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పరిపాలన అనుమతులు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు.

    నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని తిరుపతి సమీపంలో కోబాక వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి రోజైన జూలై 8న నైపుణ్య కళాశాలలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేతులు మీదుగా శంకుస్థాపన చేయించాలని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 100కు పైగా కోర్సులు: నైపుణ్య కళాశాలల్లో 100కి పైగా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటిలో 49 టెక్నికల్, 41 నాన్‌ టెక్నికల్, 20 సెక్టోరియల్‌ స్కిల్‌ కోర్సులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటికి కావాల్సిన నైపుణ్య అవసరాలను గుర్తించి ఈ కోర్సులను రూపొందించారు. అలాగే ఈ కోర్సులకు కావాల్సిన ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం కావడానికి 18 ప్రముఖ సంస్థలు ముందుకు రావడంతో పాటు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.