రాష్ట్రంలో సీవోఈ ఏర్పాటుకు అమెజాన్‌ ఆసక్తి

ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఏపీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ), డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. గురువారం వర్చువల్‌గా అమెజాన్‌ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రజా పథకాల్లో వినియోగిస్తోన్న టెక్నాలజీలో భాగస్వామ్యం కావాల్సిందిగా అమెజాన్‌ను ఆహ్వానించారు.

రాష్ట్రంలో అమెజాన్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. టెక్నాలజీ ఆధారిత సేవలకు సంబంధించి అమెజాన్‌ ప్రతిపాదనలు తీసుకువస్తే ప్రభుత్వ పరంగా పరిశీలిస్తామని హామీనిచ్చారు. అమెజాన్‌ ప్రతినిధులు కంట్రీ హెడ్‌ అజయ్‌ కౌల్, బిజినెస్‌ హెడ్‌ విజయ శకునాలకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ఐటీ కార్యక్రమాలను వివరించారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/amazon-interested-setting-coe-andhra-pradesh-1407732