రాష్ట్రాలను దాటి మరీ పింఛన్ల పంపిణీ

    హైదరాబాద్‌, బెంగళూరులో పింఛన్లు అందిస్తున్న వలంటీర్లు

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఇంటికే నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పింఛన్‌దారులు ఇంట్లో ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరీ ఇస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్‌ నగదు వారి చేయికి అందిస్తున్నారు.

    • కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు పింఛన్‌ అందజేసి వలంటీర్‌ ప్రశంసలు అందుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గోవిందమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మూడు నెలల నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో పింఛన్‌ పొందలేకపోయింది. మంగళవారం వలంటీర్‌ సురేశ్‌బాబు సొంత ఖర్చులతో బెంగళూరు వెళ్లి బయోమెట్రిక్‌ వేయించుకొని 3 నెలల పింఛన్‌ రూ.6,750 అందజేశాడు.
    • మడకశిర మండలం వైబీహళ్లి సచివాలయం పరిధిలోని గ్రామ వలంటీర్‌ హనుమంతేగౌడ్‌ తెలంగాణకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్‌ అందజేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న దివ్యాంగురాలు లక్ష్మీదేవికి మంగళవారం మూడు నెలల పింఛన్‌ డబ్బు అందించారు. హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయం కళాశాలలో లక్ష్మీదేవి డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఆమె రెండు నెలల పింఛన్‌ తీసుకోలేదు. ఇది తెలుసుకున్న వలంటీర్‌ వెళ్లి పింఛన్‌ డబ్బు అందజేసినట్లు కార్యదర్శి పెద్దన్న తెలిపారు.

    Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/volunteers-distributed-pension-other-states-also-pensioners-1384588