రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న దిశ యాప్ డౌన్లోడ్స్

దిశ పోలీస్‌స్టేషన్‌లు మహిళల రక్షణకు నిరంతరం అండగా ఉంటాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు . శనివారం విశాఖలోని ఎండాడ దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆమె సందర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్‌స్టేషన్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తరవాత విధిగా దిశ పోలీస్‌ స్టేషన్‌లో రిజిస్ట్రేషన్‌ (ఎస్‌వోఎస్‌) చేయించుకోవాలని సూచించారు. ఎస్‌వోఎస్‌ సమయంలో కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/taneti-vanitha-disha-police-stations-women-safety-1452842