రెండేళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ. 65 వేల కోట్లు AP CM YS Jagan releases Rs 128.47 cr to 6,27,906 lakh farmers under zero interest crop loan scheme

    అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన రెండేళ్లలో ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. విత్తనాలు అందించడం మొదలుకొని పంటలు అమ్ముకునే వరకు రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతులు ఏ పరిస్థితుల్లో నష్టపోతారో గమనించి వాటిని నివారించేలా రైతన్నల కోసం పలు చర్యలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలుగా ప్రతి రైతు తమ పంటల వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని సీఎం జగన్‌ 2021 ఏప్రిల్ 20న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు, అధికారులను ఉద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  

    “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వారిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డ దాదాపు 62 శాతం జనాభా బాగా బతికే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఎఫ్‌అండ్‌ఏ) సర్వే ప్రకారం భూమి మీద ఉన్న దాదాపు 780 కోట్ల మంది ప్రజల్లో 60 శాతం మంది వ్యవసాయం, అనుబంధ విభాగాలపై ఆధారపడి ఉన్నట్లు తేలింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే చెబుతున్నాం” అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

    రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 22 నెలల్లో ప్రతి అడుగులో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశామనీ, రాష్ట్రంలో 18.70 లక్షల పంపుసెట్లు ఉండగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామనీ, దీని ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలనే ఉద్దేశ్యంతో ఏటా దాదాపు రూ.8,800 కోట్ల చొప్పున రెండేళ్లలో దాదాపు రూ.17,600 కోట్లు ఖర్చు చేశామనీ సీఎం వివరించారు. ఫీడర్ల నాణ్యత కోసం అదనంగా మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని ఒక రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నానని ఆయన తెలిపారు.

    నాన్న కన్నా మరో నాలుగు అడుగులు ముందుకు…

    “నాన్న వైఎస్ఆర్ రైతుల కోసం కొన్ని అడుగులు వేస్తే ఇప్పుడు ఆయన కంటే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నా. వైఎస్ఆర్  రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రాష్ట్రంలో అర హెక్టారు (1.25 ఎకరాలు) ఉన్న రైతులు 60 శాతం, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. రైతులకు ఏటా మనం ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం వారికి దాదాపు 80 శాతం వరకు ఉపయోగపడుతోంది. రైతులకు ఏటా మూడు విడతల్లో ఈ సాయం అందిస్తున్నాం. ఇప్పటికే రెండేళ్లు ఇచ్చాం. మూడో ఏడాది కూడా ఇవ్వబోతున్నాం.  వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఈ రెండేళ్లలో 51.59 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున మొత్తం రూ.13,101 కోట్లు ఖర్చు చేశాం” అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

    విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామనీ, ఈ కేంద్రాలు ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుస్తున్నాయనీ, రైతుల చేయి పట్టుకుని నడిపిసున్నాయనీ, ఆ విధంగా గ్రామ స్థాయిలోనే సేవలు అందిస్తున్నామనీ సీఎం తెలిపారు.

    కేవలం ఒక్క రూపాయి కడితే చాలు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. అన్ని ఆర్బీకేలలో ఈ–క్రాప్‌ డేటాలో నమోదు చేసుకునే సదుపాయం ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు 22 నెలల వ్యవధిలో రూ.1,968 కోట్లకు పైగా బీమా పరిహారం చెల్లించింది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తోంది. ఆ మేరకు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.1,056 కోట్ల మేరకు రైతులకు సాయం అందించింది.

    సున్నావడ్డీ కోసం రూ. 1300 కోట్లు

    సున్నా వడ్డీని అమలు చేయకుండా గత టీడీపీ ప్రభుత్వం వదిలేసిన బకాయిలు దాదాపు రూ.850 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. ఇది కాకుండా వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2019 – 20 ఖరీఫ్‌కు సంబంధించి రూ.289 కోట్లు ఇచ్చింది. అదే ఏడాది (2020) రబీకి సంబంధించి రూ.128.47 కోట్లు 2021 ఏప్రిల్ 20న చెల్లించింది. 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 61,22,588 మంది రైతులకు రూ.1,132.54 కోట్లు ఇచ్చింది. అలా మొత్తం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు దాదాపుగా రూ.1,300 కోట్లు అందించడం విశేషం.

    రైతులకు సున్నా వడ్డీ వంటి పథకాలు అందాలంటే ఈ–క్రాపింగ్‌ చాలా అవసరం. 2021 జూన్‌ నుంచి మళ్లీ ఈ–క్రాపింగ్‌ నమోదు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఈ–క్రాపింగ్‌లో నమోదు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

    ఇవే కాకుండా రైతులకు అండగా నిలిచేందుకుగాను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయనిధికి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించింది. కనీస మద్దతు ధర లేని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రూ.4,761 కోట్లు ఖర్చు చేసి పలు పంటలను కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం రూ.18,344 కోట్లు ఖర్చు చేసింది.

    మరోవైపున రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పాడి పరిశ్రమ వైపు ప్రభుత్వం దృష్టి సారించింది.   పాడి రైతులు, అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు ఏపీ–అమూల్‌ పాలవెల్లువ ద్వారా ప్రభుత్వం నాలుగు జిల్లాలలోని దాదాపు 600 గ్రామాలలో పాల సేకరణ చేపట్టింది. దీంతో ఇప్పుడు ఒక్కో లీటరుపై పాడి రైతులకు దాదాపు రూ.7 ఎక్కువ గిట్టుబాటు అవుతోంది. అలాగే జగనన్న జీవక్రాంతి పథకం కింద ప్రభుత్వం దాదాపు 1.20 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు చేయూతలో పాడిగేదెలు అందిస్తోంది.

    ఇంకోవైపు ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సరఫరా చేస్తోంది. ఇందుకోసం ఏటా దాదాపు రూ.780 కోట్లు ఖర్చు చేస్తోంది. రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే ఆలోచన లేకుండా గత ప్రభుత్వం దాదాపు 434 కుటుంబాలను వదిలేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం  ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. అలాగే దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న 82 మంది రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.

    మేనిఫెస్టోలో నవరత్నాల తొలి వాగ్దానాలన్నీ రైతులకు సంబంధించినవే. అందులో చెప్పిన ప్రతిదీ మనసా వాచా కర్మణా ఈ రెండేళ్లలో అమలు చేశానని ఒక రైతుబిడ్డగా, సగర్వంగా చెబుతున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

    రైతుబిడ్డగా చెబుతున్నా..

    “నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లను స్వయంగా చూశా. వారికి ఎలా మేలు చేయాలన్నది ఆనాడే ఆలోచించా. రైతుల కష్టనష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. ఒకటి.. పెట్టుబడి ఖర్చు బాగా పెరగడం. రెండవది రైతు కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారుల ప్రమేయం. మూడోది పంటలకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడం. నాలుగో కారణం.. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ 22 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు అండగా నిలబడ్డామని ఒక రైతు బిడ్డగా, మీ అందరి బిడ్డగా, ఒక అన్నగా సగర్వంగా చెబుతున్నా” అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

    పలువురు రైతులు సున్నా వడ్డీ పథకం కింద తమకు ప్రయోజనం చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు. అందుకు సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

    “రెండు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తున్నాను. బ్యాంకు నుంచి రూ.90 వేలు రుణం తీసుకున్నా. సకాలంలో చెల్లించినందుకు నాకు సున్నా వడ్డీ కింద రూ.3,600 జమ అవుతున్నట్లు ఆర్బీకే జాబితాలో ఉంది. 2 సార్లు రైతు భరోసా కూడా అందింది. పంటల బీమాకు మీరు ఒక్క రూపాయి కడితే చాలన్నారు. మొదటి ఏడాది పత్తి, కందికి కట్టాను. పంటనష్ట పరిహారం కూడా అందింది” అని ప్రకాశం జిల్లా దువ్వలకు చెందిన సీహెచ్‌ శ్రీనివాస్ అనే రైతు చెప్పారు.