రెండో దశ నాడు-నేడులో 25,000 స్కూళ్లు.. రూ.8,500 కోట్లు

  • ఇప్పటికే 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో తొలిదశ పూర్తి
  • మొత్తం రూ.16,450.69 కోట్లతో 61,661 ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మార్చే ప్రణాళిక
  • నాడు–నేడు రెండో దశ వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశం

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పది రకాల కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు – నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. నాడు – నేడు రెండో దశలో రూ.8500 కోట్ల అంచనా వ్యయంతో 25 వేల స్కూళ్లలో పనులు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే రెండో దశలో కొన్ని పాఠశాలల్లో నాడు – నేడు పనులు ప్రారంభం కాగా మరిన్ని స్కూళ్లను కూడా చేర్చి మొత్తం 25 వేల స్కూళ్లలో పనులను శరవేగంగా పూర్తి చేయాలని బుధవారం విద్యారంగంపై సమీక్ష సందర్భంగా అధికారులకు నిర్దేశించారు. ఈ నేపథ్యంలో రెండో దశలో రూ.8500 కోట్ల అంచనా వ్యయంతో 25 వేల స్కూళ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. 

తొలిదశ విజయవంతంగా పూర్తి
ఇప్పటికే నాడు–నేడు తొలిదశలో రూ.3,697.88 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో పనులను పూర్తి చేసి రూపురేఖలను సమూలంగా మార్చడం తెలిసిందే. మిగిలిన విద్యాసంస్థల్లో తరువాత దశల్లో పనులు పూర్తి కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.16,450.69 కోట్ల అంచనా వ్యయంతో 61,661 ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-high-level-review-education-sector-1448655