రేషన్‌ డోర్‌ డెలివరీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

  • ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది. ‘ఇంటింటికీ రేషన్‌’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే. ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు.

కాగా, హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై  ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది.