రైతన్నకు రక్షణగా ‘పోలీస్’‌ వ్యవస్థ

  • అన్నదాతల సమస్యల పరిష్కారానికి జిల్లాకొక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌
  • పంటలు అమ్మడానికి వెళ్లినప్పుడు మోసాలకు గురైతే అండగా నిలవడం దీని ఉద్దేశం  
  • ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
  • ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ తరహాలో రైతుల కోసం హెల్ప్‌ డెస్క్‌
  • ఇవి జిల్లా స్థాయి పోలీస్‌స్టేషన్‌ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచన
  • ఈ మేరకు పూర్తి స్థాయిలో ఆలోచించి కార్యాచరణ తయారు చేయాలి
  • అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు కావాలి
  • రైల్వేస్టేషన్లు, బస్‌ స్టాండ్లతో పాటు విద్యా సంస్థల వద్ద సైబర్‌ కియోస్క్‌లు 

తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా మంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే, మోసానికి గురైతే.. చట్టపరంగా, ఇతరత్రా రక్షణగా ఈ కొత్త వ్యవస్థ వారికి అండగా నిలవాలి. ఎంత త్వరగా స్పందించి, వారికి అండగా నిలబడుతున్నామన్నదే ప్రధాన లక్ష్యం. ఇందుకు రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు పరస్పర అవగాహన, అనుసంధానంతో పని చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా యూనిఫామ్స్‌ నిర్దేశించాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు, మోసాలకు గురికాకుండా రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని, ఇందు కోసం జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే వారికి అండగా నిలిచి, వారికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. బయటి ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా వారికి భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలు, సైబర్‌ కియోస్క్ లు, జిల్లాకొక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, సచివాలయ సిబ్బందికి యూనిఫాం, స్పందన నిర్వహణ అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ డెస్‌్కలు అన్నీ జిల్లా స్థాయి పోలీస్‌ స్టేషన్‌ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనని తెలిపారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై మేధోమథనం చేసి, పూర్తి స్థాయిలో ఆలోచించి.. కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..