రైతన్నకు వంద శాతం మధ్ధతు

రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూసేందుకే ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎవరూ ఇలా చేయలేదన్నారు. కలెక్టర్లు, జేసీలు రైతులకు ఎంఎస్‌పీ దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లపై ముఖ్యమంత్రి జగన్‌ పలు సూచనలు చేశారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు దోపిడీకి గురి కారాదు 
అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తడిసిన, రంగు మారిన ధాన్యాన్నీ కూడా కొనుగోలు చేశామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంఎస్‌పీకి ఒక్క పైసా కూడా తగ్గకుండా రైతులకు ధర అందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీకి గురి కారాదని స్పష్టం చేశారు. రైతులకు మంచి ధర అందించాలన్న తపనతో ముందుకు సాగాలని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేవలం రైతుల పేర్లను నమోదు చేయడంతో సరిపెట్టకూడదని, అక్కడితో బాధ్యత పూర్తైందని భావించరాదని స్పష్టం చేశారు.  

కొనుగోళ్లపై రోజువారీ సమీక్ష  
రోజువారీగా కొనుగోలు కేంద్రాలు, కొనుగోళ్లపై కలెక్టర్లు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో అవసరమైన కూలీలను కూడా ఆర్బీకేల పరిధిలో సమీకరించుకోవాలని, ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రైతుల నుంచి నిరంతరం ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎంఎస్‌పీ దక్కడం, దోపిడీకి గురి కాకుండా చూడటం, కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్ల పాత్రను నివారించడం మన ముందున్న లక్ష్యాలని స్పష్టం చేశారు.  

పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు 
వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ గుర్తు చేశారు. ‘ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఆర్బీకేలను తెచ్చి విత్తనం నుంచి కొనుగోళ్ల వరకూ సేవలు అందిస్తున్నాం. పంటల ధరలపై పర్యవేక్షణకు సీఎం యాప్‌ను తెచ్చాం. 1,100 మల్టీ పర్పస్‌ గోడౌన్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిపై కలెక్టర్లు దృష్టి సారించాలి. గోడౌన్ల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు.  

నెలాఖరు కల్లా భూముల గుర్తింపు  
‘పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయిలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 26 చోట్ల వీటిని నెలకొల్పుతున్నాం. అవసరాలను బట్టి వీటికి భూములు గుర్తించి అప్పగించే ప్రక్రియ నెలాఖరు కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.   

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jaganmohan-reddy-minimum-support-price-farmer-grain-purchase