రైతుకు ప్రయోజనం చేకూరుస్తున్న ఉపాధి హామీ పధకం

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పెడుతున్న ఖర్చులో 70 శాతం నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన పనులకే ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 10 వరకు రాష్ట్రంలో ఈ పథకం ద్వారా రూ.7,111 కోట్లు ఖర్చు చేస్తే, అందులో రూ.4,944 కోట్ల మేర వ్యవసాయం, అనుబంధ రంగాల పనులకే ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. 165 రకాల పనులకు ప్రాధాన్యం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం.. మొత్తం 260 రకాల పనులు ఈ పథకం ద్వారా చేపట్టవచ్చు. అందులో 165 పనులను వ్యవసాయ, వాటి అనుబంధ రంగాలకు సంబంధించినవిగా వర్గీకరించారు. దీనితో నిధుల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం ఈ 165 రకాల పనులకే అధిక ప్రాధాన్యత నిస్తోంది. ఈ ఏడాది వ్యవసాయ కేటగిరీలో రూ.6,709 కోట్ల విలువ చేసే 6,82,022 పనులను చేపట్టాలని ప్రతిపాదించగా.. ఈ నెల 10వ తేదీ వరకు 4,23,781 పనులకు గాను రూ.రూ.4,944 కోట్లు ఖర్చు చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు చేసేలా..  పంట వేయడానికి ముందు వ్యవసాయ భూమిని చదును చేసుకోవడానికి,  పొలానికి నీరు వచ్చే చిన్న చిన్న సాగునీటి కాల్వల్లో పూడిక తీయడం వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపడుతోంది. పండిన పంట దాచుకోవడానికి గిడ్డంగుల నిర్మాణానికీ వీలు కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తూ రైతుకు మేలు కలిగేలా ఉపాధి హామీని మలుచుకుంటుంది.