రైతుభరోసా కేంద్రాల్లో మిరప విత్తనాల పంపిణీ

  • ఆర్బీకేల ద్వారా పంపిణీ
  • అందుబాటులో ప్రాచుర్యం పొందిన ప్రీమియం, హైబ్రిడ్‌ విత్తనాలు
  • 20 సీడ్‌ కంపెనీలతో ఏపీ ఆగ్రోస్‌ ఒప్పందం
  • అక్రమ వ్యాపారులకు, అధిక ధరలకు చెక్‌
  • ఖరీఫ్‌లో మిర్చిసాగు లక్ష్యం 1.97 లక్షల హెక్టార్లు

  మిర్చి రైతులకు విత్తన కష్టాలు తీరనున్నాయి. ఖరీఫ్‌లో అపరాల తర్వాత అత్యధికంగా సాగయ్యే మిరప విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడేవారు. మోసపోయేవారు. ఇన్నాళ్లు విత్తన కంపెనీలు, వ్యాపారసంస్థలపై సరైన నియంత్రణ లేకపోవడంతో కృత్రిమ కొరత సృష్టిస్తూ రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవి. మరోవైపు మార్కెట్‌లోకి వచ్చే నాసిరకం విత్తనాల బారినపడి రైతులు ఏటా తీవ్రంగా నష్టపోయేవారు.

  ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ విత్తనం మాదిరిగానే నాన్‌ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాన్ని కూడా వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో 1,79,891 హెక్టార్లలో మిరప సాగవుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 80,264, ప్రకాశంలో 35,031, కర్నూలులో 24,538, కృష్ణాలో 15,860, అనంతపురంలో 5.536, విజయనగరం జిల్లాలో 4,989 హెక్టార్లలో రైతులు సాగుచేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో 1.97 లక్షల హెక్టార్లలో మిరపసాగు లక్ష్యంగా నిర్ణయించారు. 

  నాన్‌ సబ్సిడీ కేటగిరీలో పంపిణీ
  రాయితీ విత్తనాల మాదిరిగానే నాన్‌ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వాదేశాల మేరకు 20 సీడ్‌ కంపెనీలతో ఏపీ ఆగ్రోస్‌ ఒప్పందం చేసుకుంది. ఈనెలాఖరు నుంచి జూన్, జూలై నెలల్లో విడతల వారీగా అవసరమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు కృష్ణాజిల్లాకు 511, గుంటూరుకు 1,823, ప్రకాశం జిల్లాకు 578 కిలోల ఆర్మోర్‌ రకం హైబ్రిడ్‌ విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,339 కిలోల ఆర్మోర్‌ సీడ్‌ సరఫరాకు అంగీకరించిన నున్‌హెమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటడ్‌ కంపెనీ ఇప్పటికే 697 కిలోలు జిల్లాలకు పంపింది.

  పారదర్శకంగా పంపిణీ
  సాధారణంగా తొలకరి మొదలైన జూన్‌లో విత్తన విక్రయాలు మొదలవుతాయి. ఈసారి కరోనా బూచి చూపి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించకుండా కట్టడి చేయడంతోపాటు ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరా పారదర్శకంగా చేపట్టే లక్ష్యంతో విత్తన పంపిణీ, అమ్మకందార్లతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సాగుకు ఇంకా సమయం ఉన్నందున దళారీల ఉచ్చులోపడి అధిక ధరలకు కొనకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఒకే కంపెనీ విత్తనాలు కొనాలని చూడకుండా అదే సెగ్మెంట్‌లో ఉన్న ఇతర కంపెనీలకు చెందిన మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు, ధరల వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.

  సాగయ్యే మిర్చి రకాలు
  సాధారణంగా మిర్చి సాగువిస్తీర్ణంలో 40 శాతం ప్రీమియం (ఓపెన్‌ పాలినేటెడ్‌ (ఓపీ) వెరైటీస్‌), 60 శాతం హైబ్రిడ్‌ రకాలు సాగవుతుంటాయి. 

  ప్రీమియం రకాలు: ఎల్‌సీఎ–334, 341, 273, 2222, రెడ్‌హాట్, రోమి, గిని, సూపర్‌–10,20, రూబే, వజ్ర, అమరావతి, జై కిసాన్‌.
  హైబ్రిడ్‌ రకాలు: ఆర్మోర్, తేజశ్విని, యశస్విని, యూఎస్‌–341, బంగారం, వండర్‌హాట్, యూఎస్‌–4884, రెడ్‌హాట్, ఇందమ్‌–5, హెచ్‌పీహెచ్‌–5531, హెచ్‌పీహెచ్‌–2043, వీఎన్‌ఆర్‌–577. హెక్టార్‌కు హైబ్రిడ్‌ విత్తనం 300 గ్రాములు, ప్రీమియం విత్తనం 650 గ్రాములు అవసరం.

  బ్లాక్‌ మార్కెట్‌కు చెక్‌పెట్టేందుకే..
  ప్రాచుర్యం గల మిర్చి విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్‌ మార్కెట్, అధిక ధరల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించాం. నిర్ణీత ధరల కన్నా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని స్పష్టం చేశాం. వారినుంచి స్వాధీనం చేసుకున్న విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. 
  – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి