రైతులకు సోలార్‌ పవర్‌

  • జిల్లాలో సీఎస్‌పురం, దొనకొండ మండలాల్లో సోలార్‌ పార్కులు 
  • రైతులకు 9 గంటలు నిరంతరాయ విద్యుత్‌ అందించేందుకు చర్యలు 
  • భూములిచ్చిన రైతులకు ఏడాదికి రూ.25 వేలు లీజు 
  • అవసరమైన భూమి సుమారు 5,930 ఎకరాలు 
  • గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా సోలార్‌ పార్కుల ఏర్పాటు

  వైఎస్సార్‌ సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, ల్యాబ్‌లు, పాడి రైతుల అభివృద్ధి కోసం అమూల్‌ సంస్థతో కలిసి పనిచేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రైతుల వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 10 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా కొన్ని సాంకేతిక కారణాలతో తొలి విడతలో 6400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జిల్లాకు 1200 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని కేటాయించారు. దొనకొండ మండలం రుద్ర సముద్రం ఆల్ట్రా మెగా సోలార్‌ పార్కు నుంచి 600 మెగావాట్లు, సీఎస్‌పురం సోలార్‌ పార్కు నుంచి మరో 600 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు.

  ఆ మేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జీఈసీఎల్‌) ద్వారా సోలార్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జీఈసీఎల్‌ ద్వారా డీఈని నియమించారు. మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ అడిగిన మొత్తం 5930.88 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 1558.67 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2137 ఎకరాలు, పట్టా భూమి సుమారు 300 ఎకరాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, పట్టా భూములు కలిపి మొత్తం సుమారు 4 వేల ఎకరాలు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయించారు.  

  ఎక్కడెక్కడ..ఎంతెంత భూమి.. 
  సీఎస్‌పురం ఆల్ట్రా మెగా సోలార్‌ పార్కు కోసం 3,363 ఎకరాలు అవసరం కాగా 289 ఎకరాల ప్రభుత్వ భూమి, 1366 ఎకరాల అసైన్డ్‌ భూమి, 194 ఎకరాల పట్టా భూములను సమకూర్చారు. సీఎస్‌పురం మండలంలోని పెదగోగులపల్లి, దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లి గ్రామాల్లో భూములు కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దొనకొండ మండలంలో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా మెగా సోలార్‌ పార్కుకు సంబంధించి అవసరమైన మొత్తం 2567.88 ఎకరాల్లో ఇప్పటికే 1269.67 ఎకరాల ప్రభుత్వ భూమి, 547 ఎకరాల అసైన్డ్‌ భూములు అందజేశారు.  సోలార్‌ పార్కు కోసం పట్టా భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున లీజు కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. లీజుకు చెల్లించే మొత్తానికి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున పెంచుతూ లీజు చెల్లిస్తారు.   

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/solar-power-will-be-provided-farmers-ongole-1378964