రైతుల ఖాతాల్లోకి రూ.2,977.82 కోట్ల బీమా జమ

ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.

దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్‌ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్‌ అన్నారు.

రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. మన రాష్ట్రంలో జరగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయి. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశాం.

దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 15.61లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్లను అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysr-uchita-pantala-bheema-cm-jagan-sri-sathya-sai-district-tour-live