రైతు ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం 

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌’ను సంప్రదించాలని సూచించారు.