రైతు భరోసా– పీఎం కిసాన్‌ అమలులో ఏపీ నంబర్‌ వన్‌

    వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం అమల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచిందని వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. పీఎం కిసాన్‌ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో అర్హత గల వారికి పెట్టుబడి సాయం అందేలా చేయడం, రికార్డు స్థాయిలో గ్రీవెన్స్‌ను పరిష్కరించడంతో పాటు.. క్షేత్ర స్థాయి పరిశీలన వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారంటూ నీతి ఆయోగ్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌గా ఏపీని ప్రకటించినట్టు చెప్పారు.

    వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద గడిచిన మూడేళ్లుగా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది పీఎం కిసాన్‌ పోర్టల్లో 58,11,593 మంది రిజిస్టర్‌ చేసుకోగా, వారిలో 49,82,634 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలన్నీ పాటిస్తూ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో 86 శాతం మందిని అర్హులుగా గుర్తించి సాయం అందించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.