రైతుల సంక్షేమం దిశగా వై ఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించడం కోసం ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) ఛానల్‌ను ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ఈ ఛానల్‌ను ప్రారంభించారు.

ఆయా సీజన్లలో వేసుకోవలసిన పంటలు, అధిక దిగుబడి కోసం అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, సాగు సమస్యల పరిష్కారానికై శాస్త్రవేత్తల సలహాలు, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు ఆదాయం రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం, మార్కెట్ ధరల సమాచారం, రైతు సంక్షేమ పథకాలపై అవగాహన, అభ్యుదయ రైతుల విజయగాధలు, వీక్షకులతో ఫోన్ ద్వారా లైవ్ చర్చలు, ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన వ్యవసాయ నూనత సాంకేతికత … ఇలా వివిధ అంశాలపై వీడియోల రూపంలో సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఆర్బీకే ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ ఛానెల్ కోసం కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఆర్బీకే స్టుడియోను నిర్వహిస్తోంది. ఈ ఛానెల్ ద్వారా ప్రసారం చేసే వ్యవసాయ కార్యక్రమాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో స్మార్ట్‌టీవీలను కూడా ఏర్పాటు చేసింది. లక్షమందికి పైగా subscribers తో ఈ ఛానెల్ ఇప్పటికే రైతుల ఆదరణను చూరగొంటోంది.

2021 మార్చి 18న ఈ ఛానెల్ ప్రారంభం సందర్భంగా సీఎం వై ఎస్ జగన్ మాట్లాడుతూ ఆర్బీకేల ప్రస్థానంలో ఇది మరో ముందడుగు అన్నారు. ఏ రైతూ నిర్దేశిత ధరల కంటే తక్కువకు పంట అమ్ముకోవాల్సిన అన్యాయమైన పరిస్థితి ఉండకూడదన్నారు. రైతు పంట అమ్ముకోలేని పరిస్థితి ఉంటే మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. రైతులెవరైనా 155251 టోల్ ప్రీ నంబరు ద్వారా ఆర్బీకేను సంప్రదించి తమ సందేహాలకు సమాధానం పొందవచ్చని సీఎం తెలిపారు. విత్తనం దగ్గరి నుంచి పంటల విక్రయం వరకు రైతు చేయి పట్టుకుని నడిపించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. మార్కెటింగ్ సదుపాయాల కల్పన, అగ్రి ల్యాబ్‌లతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామాలలోనే గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాలలో జనతా బజార్లు ఏర్పాటు జరిగేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
పంటల కొనుగోలుకు రూ. 28,430 కోట్లు వ్యయం
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 2021 మార్చి రెండో వారం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల (పంటల) సేకరణ కోసం రూ. 28,430 కోట్లు ఖర్చు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పంటల సేకరణ కోసం మొత్తం రూ.28,430 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వ్యవసాయ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇందులో వరి సేకరణకు రూ. 22,918 కోట్లు, ఇతర పంటలకు రూ. 5,512 కోట్లు ఖర్చు చేసినట్లు వారు వివరించారు. కాగా, 2015–16 నుంచి 2018–19 వరకు గత (టీడీపీ) ప్రభుత్వం నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం రూ.43,047 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు 6,081 ఆర్బీకేల కింద రబీ పంట ఉత్పత్తుల సేకరణ కూడా ప్రారంభించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఆర్బీకేను యూనిట్‌గా తీసుకుని ప్రతి గ్రామానికి పంట ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళికలను ప్రతి ఆర్బీకేకు పంపాలని, వాటి పోస్టర్లను ఆర్బీకేలలో ఉంచాలని ఆయన చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతుల అవసరాలన్నిటినీ తీర్చడానికి కృషి చేయాలని, వారు గ్రామాల నుండి వలసలు పోకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 2020-21 రబీ ఉత్పత్తుల సేకరణ, 2021-22 ఖరీఫ్ సీజన్ సన్నాహాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
అవసరాలకు అనుగుణంగా ఆర్డరు పెట్టిన తర్వాత నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వంటివి ఆర్బీకేల ద్వారా రైతులకు 48 నుండి 72 గంటల్లోగా చేరాలని ఆయన అన్నారు. ఖరీఫ్‌కు పంపిణీ చేయాల్సిన విత్తనాలు మంచి నాణ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే మంచి ధర లభించే వివిధ రకాల వంగడాలపై వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులో అవగాహన కల్పించాలని ఆయన అధికారులను కోరారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడేలా ఈ విషయంలో పోస్టర్ తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో ఉండేలా చూడాలని సూచించారు. ఆర్బీకేలన్నింటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని సీఎం ఆదేశించారు. ఇది ఇంటరాక్టివ్ విధానంలో రైతుల సందేహాల నివృత్తికి తోడ్పడుతుందన్నారు.
రియల్ టైమ్‌లో పనిచేసే వైయస్ఆర్ యాప్
ఇదిలావుండగా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వైయస్ఆర్ యాప్ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను కూడా ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటల బీమా పథకం, సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతులను సన్నద్ధం చేయడం, రైతులకు ఉత్పాదకాల పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఈ యాప్‌లో ఆర్బికే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికార బృందం పర్యవేక్షిస్తుంది.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్బికేల్లో డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్బికే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్బికే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వేలు నిర్వహించడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా వీలవుతుంది.
ఆర్బీకే పెర్ఫార్మ్న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల పనితీరును పరిశీలించి, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్‌కు రూపకల్పన చేశారు.
సమాచార సాంకేతికతను ఉపయోగించుకుని రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఇలా పలు రూపాలలో ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగి రెడ్డి, వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మలకొండయ్య, పౌర సరఫరా కమిషనర్ కోన శశిధర్, మార్కెటింగ్ – సహకార శాఖల ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఎండి సూర్యకుమారి తదితరులు సీఎం వైఎస్ జగన్ నిర్దేశాల మేరకు ఈ ప్రయత్నాలలో చురుకుగా భాగం పంచుకుంటున్నారు.
ఆర్బీకే ఛానెల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.