వక్ఫ్‌ భూములపై డిజిటల్‌ నిఘా

  • రీ సర్వే, డిజిటలైజేషన్‌కు ప్రభుత్వం చర్యలు
  • 1,963 గెజిట్‌ ప్రకారం రాష్ట్రంలో 3,502 వక్ఫ్‌ సంస్థలు
  • ఆ సంస్థలకు చెందిన ఆస్తులు 65,260 ఎకరాలు
  • గత పాలకుల నిర్లక్ష్యంతో మసీదులు, దర్గాల ఆస్తుల ఆక్రమణ
  • ఇప్పటికే అన్యాక్రాంతమైనవి 22,553.06 ఎకరాలు
  • ఆస్తుల్లో కర్నూలు టాప్‌.. ఆక్రమణల్లో చిత్తూరు ఫస్ట్‌ 

   వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్‌ భూములు, స్థలాలను రీ సర్వే చేసి, డిజిటలైజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో టీడీపీ నాయకులు ఎక్కువగా ఆక్రమించుకున్నారు. వక్ఫ్‌ గెజిట్, రికార్డుల్లో ఉన్నప్పటికీ సబ్‌ డివిజన్‌లు, సర్వే నంబర్లు మార్పు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మసీదులు, దర్గాల నిర్వహణ కోసం ముస్లిం పెద్దలు, దాతలు వక్ఫ్‌కు ఇనాంగా ఇచ్చిన ఆస్తులను అప్పనంగా కాజేసి సొంత ఆస్తుల్లా అనుభవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,553 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

  రూ.2,500 కోట్ల ఆస్తుల అన్యాక్రాంతం
  గెజిట్‌–1963 ప్రకారం 13 జిల్లాల్లో 3,502 మసీదులు, దర్గాలు, ఇతర సంస్థలకు చెందిన భూములు 65,260.97 ఎకరాలున్నాయి. గెజిట్‌లో లేని భూములు మరో 20వేల ఎకరాల దాకా ఉంటాయి. ఒకసారి వక్ఫ్‌లోకి వస్తే శాశ్వతంగా వక్ఫ్‌లోనే అనే చట్టం ఉన్నా ఆక్రమణలు మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రంలో 22,553.06 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.ఆక్రమణల్లో చిత్తూరు ఫస్ట్‌
  వక్ఫ్‌ ఆస్తులు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉండగా ఆక్రమణల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో 22,599.89 ఎకరాల వక్ఫ్‌ భూములు ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. గెజిట్‌లో లేని భూములు మరో పది వేల ఎకరాల దాకా ఉంటాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 6,671 ఎకరాలు ఉండగా ఏకంగా 5,162.99 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. 

  పర్యవేక్షణ లేక..
  వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. అక్రమార్కులు అడ్డదారుల్లో ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. కొందరు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు అనుభవదారులమంటూ కోర్టుకెళ్తున్నారు. 

  రీ సర్వే, డిజిటలైజేషన్‌ 
  వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రీ సర్వే, డిజిటలైజేషన్‌ చేయిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విధివిధానాలు జారీ చేసింది. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ సెక్రటరీల సహకారం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి స్వాధీనం కావడంతో పాటు భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. 

  తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి
  వక్ఫ్‌ భూములను రీ సర్వే చేసి డిజిటలైజ్‌ చేయడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం. అది పూర్తయ్యాక గెజిట్‌లో పొందుపర్చాలి. వాటిని పరిరక్షించేందుకు సీసీఎల్‌ఏకు అధికారమిచ్చి తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలివ్వాలి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమీక్ష రెగ్యులర్‌గా నిర్వహించాలి.
  – ఎస్‌.రోషన్‌అలీ, రిటైర్డు తహసీల్దార్, కర్నూలు

  కరోనా వల్ల తాత్కాలికంగా ఆగింది
  రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్‌బోర్డు భూములు, స్థలాల రీ సర్వేకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే సర్వే కమిషన్‌ ఆఫ్‌ వక్ఫ్‌ ద్వారా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సర్వే చేస్తున్నాం. కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ ప్రక్రియ పూర్తయితే గెజిట్‌లో పొందుపరుస్తాం.
          – అలీమ్‌ బాషా,  సీఈవో, వక్ఫ్‌ బోర్డు