వచ్చే ఏడాదికి 5 వైద్య కళాశాలలు సిధ్ధం

  • ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం కాలేజీల ప్రారంభానికి కసరత్తు
  • ఒక్కోచోట 150 చొప్పున రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుదల
  • ఇక్కడి జిల్లా ఆస్పత్రులు బోధనాసుపత్రులుగా మార్పు
  • 2024–25లో 11 కాలేజీలు ప్రారంభించేలా ప్రణాళిక
  • రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2023–24) నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైద్య రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ పార్లమెంట్‌ నియోజకర్గానికి ఒక వైద్య కళాశాల ఏర్పాటుచేసి ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయాలని సంకల్పించారు.

అంతేకాక.. పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను చేరువ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో.. రూ.16వేల కోట్లకు పైగా వ్యయంతో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఓ వైపు ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు 16 నూతన వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నారు. వీటి పనులు వడివడిగా సాగుతున్నాయి.
  
బోధనాస్పత్రులుగా మార్పు
ఓ వైపు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చకచకా చేపడుతూనే వాటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లా ఆసుపత్రులను బోధనాస్పత్రులుగా మార్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల మేరకు ఓ ఆస్పత్రికి బోధనాస్పత్రి స్థాయి లభించాలంటే 330 పడకలు ఉండాలి. ఈ ఆస్పత్రుల్లో బోధనాస్పత్రి ప్రారంభించడానికి సరిపడా పడకలు ఇప్పటికే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. వీటిని బోధనాసుత్రుల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు నిర్మాణాలను చేపడుతోంది. అదే విధంగా వైద్య కళాశాల కార్యకలాపాల కోసం ఒక్కోచోట రూ.38 కోట్లతో ప్రీ–ఇంజనీర్డ్‌ బిల్డింగ్స్‌ (పీఈబీ) నిర్మిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్లకు పనులు కేటాయించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్‌ హాళ్లు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బ్లాకులతో పీఈబీలు నిర్మిస్తారు. 

వచ్చే ఏడాదికి అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు
ఇక రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలల ప్రారంభంతో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం (2023–24)లో పెరగనున్నాయి. ఇప్పటికే ఈ ఐదు ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్‌ నుంచి డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో ఎంతమంది వైద్యులు, వైద్య సిబ్బందిని సమకూర్చాల్సి ఉంటుందనే దానిపై అధికారులు సమీక్షిస్తున్నారు. అర్హతను బట్టి ప్రస్తుతం ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని డీఎంఈ పరిధిలోకి తీసుకోవాలనుకుంటున్నారు.  

రూ.12,268 కోట్లతో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల బలోపేతం
ఇక నాడు–నేడు కార్యక్రమం కింద కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రుల బలోపేతానికి రూ.12,268 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. వీటి ద్వారా మొత్తం 1,850 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరనున్నాయి. ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో 2023–24 నాటికి, మిగిలిన 11 చోట్ల 2024–25లోగా వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 

ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేస్తాం
ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఐదు ఆస్పత్రుల్లో పడకలున్నాయి. అవసరమైన మానవ వనరులు సమకూర్చుకునేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 15లోగా ఎన్‌ఎంసీకి దరఖాస్తులు చేయాలి. ఆస్పత్రులు మా పరిధిలోకి వచ్చిన వెంటనే దరఖాస్తులు చేస్తాం.  
– డాక్టర్‌ రాఘవేంద్రరావు, డీఎంఈ

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-government-setting-16-new-medical-colleges-1460550