వచ్చే ఖరీఫ్‌కు పోలవరం నీళ్లు

    • పోలవరం ప్రొజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, తదితరులు
    • టీడీపీ సర్కార్‌ ప్రణాళిక లోపం వల్లే డయాఫ్రం వాల్‌కు నష్టం
    • జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

    సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాట ప్రకారం 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి,ఆయకట్టుకు నీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ పునరుద్ఘాటించారు. ఆయన బుధవారం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్, అప్రోచ్‌ చానల్, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, అనుసంధానాల పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబులతో కలిసి ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు, సహాయ పునరావాస విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

    ఈ నెల 15 నుంచి రివర్స్‌ స్లూయిజ్‌ గేటు ద్వారా దిగువకు నీరు విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు ఇంజినీర్లు, ఇరిగేషన్‌ శాఖలో మొత్తం 80 మంది సిబ్బంది కోవిడ్‌తో మరణించినా పనులు ఆపలేదని తెలిపారు.