వడివడిగా బడి దిశగా.. 1.43 లక్షల డ్రాపవుట్స్‌ తిరిగి బడికి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పిల్లలందరూ మంచి చదువులు చదవాలని, ప్రపంచస్థాయిలో పోటీ పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పం. అందుకే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడి బాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరీ బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిలో 1,43,573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది.
 

సచివాలయాలు కేంద్రంగా 
డ్రాపవుట్స్‌ను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా స్కూళ్ల నిరంతర పర్యవేక్షణకు  ప్రత్యేకంగా కన్సిస్టెంట్‌ రిథమ్స్‌ యాప్‌ను రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పాఠశాల వయస్సుగల పిల్లలందరూ స్కూళ్లలో చేరారో లేదో పరిశీలిస్తోంది. ఈ సర్వే, పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం మేరకు బడి మానేసిన పిల్లల ఇళ్లకు సంక్షేమ, విద్యా అసిస్టెంట్, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వలంటీర్‌ వెళ్తున్నారు. పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. ఎక్కువ కాలం బడికి రాకపోతే అందుకు కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారా, బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు  ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను చూపి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మరీ పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆ వివరాలను, తల్లిదండ్రులతో సిబ్బంది మాట్లాడుతున్న ఫొటోలను ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్‌ రిథమ్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు.  

నిరంతర పర్యవేక్షణ 
పిల్లలు పాఠశాలలకు వస్తున్న తీరును సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పిల్లలు వరుసగా మూడు రోజులు బడికి హాజరు కాకపోతే తల్లిదండ్రులకు వలంటీర్లు ఫోన్‌ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. తిరిగి వారు బడికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను కూడా రిథమ్స్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్‌ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూలు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. నెలలో ఒక రోజు ఏఎన్‌ఎం స్కూళ్లను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్‌ వివరాలు సేకరిస్తున్నారు. వారంలో ఒక రోజు మహిళా పోలీసు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీరందరూ తమ పరిశీలనలో వెల్లడైన వివరాలను రిథమ్స్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. 

ప్రతి గురువారం సీఎస్‌ సమీక్ష 
గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పిల్లల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్కూళ్లలో పిల్లలు హాజరు, బడి మానేసిన వారిని తిరిగి బడుల్లో చేర్పించడంపై సమీక్షిస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిశీలన సత్ఫలితాలనిస్తోంది. పిల్లల్ని బడి బాట పట్టించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో డ్రాపవుట్స్‌ తగ్గి, స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరుగుతోంది. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/1-lakh-43-thousands-dropouts-back-school-andhra-pradesh-1495534