విదేశీ విద్యపై విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు

  • విదేశీ వర్సిటీలు, అక్కడి అలవాట్లు, సంస్కృతిపై సూచనలు 
  • విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగకరం 
  • వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌     
  • ఆంధ్రా–అమెరికా మధ్య బంధం మరింత మెరుగు  

విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయి. ప్రధానంగా అమెరికాలో చదవాలనుకునే వారికి రాష్ట్రం నుంచి రాచబాట సిద్ధమైంది. స్టెమ్‌ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు) విద్య, మహిళా సాధికారత, అమెరికన్‌ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించే వేదిక ‘అమెరికన్‌ కార్నర్‌’ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటైంది. దేశంలోనే ఇది మూడవది కావడం గమనార్హం. తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై సూచనలు, సలహాలు.. మరెన్నో విధాలుగా సేవలందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు చుక్కానిగా నిలవనుంది.

ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఈ కార్నర్‌ ఏర్పాటయ్యేందుకు కృషి చేసిన అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌కు, యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత జిల్లాకు చెందిన మహిళ వీణారెడ్డి అమెరికాలో ఉన్నతమైన పదవిలో ఉండటం సంతోషం కలిగిస్తోందన్నారు. ఇవాళ ప్రారంభమైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి.. మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖపట్నంలో అమెరికన్‌ కాన్సులేట్‌ ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యమని, దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నానని ఆకాంక్షించారు.

యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌–అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షను నెరవేర్చడంలో అమెరికన్‌ కార్నర్‌ వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం పర్యటన తనకెన్నో అనుభూతులను మిగిల్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి జోయల్‌ రీఫ్‌మన్, వీణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌ కుమార్‌ అన్నవరపు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమెరికన్‌ కార్నర్‌ ఉపయోగాలిలా..
► విశాఖలో ఏర్పాటైన అమెరికన్‌ కార్నర్‌ దేశంలో మూడవది. ఇప్పటి వరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో మాత్రమే పని చేస్తున్నాయి. 
► విశ్వవిద్యాలయాలు, కోర్సులు, ఫీజుల వివరాలు, ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, ఆహారం, వసతి సౌకర్యం తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందజేస్తుంది. 
► ఇక్కడ అన్ని సేవలు ఉచితంగా అందుతాయి.
► విదేశాల్లో విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు మార్గదర్శిగా నిలుస్తుంది. 
► ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్న రెండు ప్రభుత్వాల (రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం) ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్య భూమిక పోషించనుంది. 
► ఆంగ్లంలో నైపుణ్యం పెంచే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌తో విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. వీరందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలిస్తూ సహాయకారిగా నిలుస్తుంది. 
► ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రయోజనకారి.  

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-launched-american-corner-visakhapatnam-virtual-policy-1398077