విద్యారంగ అభివృధ్ధికి మెరుగైన ప్రణాళికలు

  • సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలతో తొలి ఏడాది నుంచే ఫలితం
  • కేంద్ర విద్యా శాఖ పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో మెరుగైన స్థానం
  • 2018–19 విద్యా సంవత్సరంలో 725 పాయింట్లతో లెవల్‌–6  (గ్రేడ్‌–3)లో నిలిచిన రాష్ట్రం
  • 2019–20లో 811 పాయింట్లతో లెవల్‌–4 (గ్రేడ్‌–1)కు పెరిగిన స్థాయి
  • 1000 పాయింట్ల సమగ్ర సూచీలో రాష్ట్రాలకు స్థానాల కేటాయింపు
  • ప్రస్తుతం అమ్మ ఒడి, నాడు–నేడు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, బైజూస్‌ కంటెంట్, ట్యాబ్‌ల పంపిణీ.. తదితర ఎన్నో కార్యక్రమాలు
  • తద్వారా రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థానం ఖాయం

ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో తీసుకుంటున్నన్ని చర్యలు, అమలు చేస్తున్న పథకాలు.. కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేంద్ర పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో రాష్ట్రం మంచి స్థానాన్ని దక్కించుకుంటే.. ఆ తర్వాతి సంవత్సరాల్లో మదింపు పూర్తయితే తప్పక అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాలు తొలి ఏడాది నుంచే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభా పాటవాలు గతంలో కన్నా ఎంతో వృద్ధి చెందాయి. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల అభ్యసన ఫలితాలు (లెర్నింగ్‌ అవుట్‌కమ్‌) మెరుగు పడినట్లు కేంద్రం ‘పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌’ నివేదికలో వెల్లడించింది.

2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నివేదికను కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్న తీరు, వినూత్న బోధన, హాజరు తదితర అంశాలను పరిశీలించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల ‘పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌’ను తయారు చేస్తోంది. 2017–18 నుంచి ఏటా ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పనితీరు 2019–20 విద్యా సంవత్సరంలో బాగా మెరుగు పడిందని తాజా నివేదికలో స్పష్టం చేసింది. 1000 పాయింట్ల సమగ్ర సూచీలో 10 స్థాయిలతో ఆయా రాష్ట్రాల స్థానాలను నివేదికలో కేంద్రం నిర్దేశించింది. జాతీయ స్థాయిలో  10 లెవల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 4వ స్థానం దక్కింది. అంతకు ముందు విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది.

ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టిన తొలి విద్యా సంవత్సరంలోనే రాష్ట్రం లెవల్‌–6 నుంచి లెవల్‌–4కు ఎదిగి రెండు స్థానాలను మెరుగు పరుచుకోవడం విశేషం. అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ అమలు, విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, బడుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌కు కావాల్సిన మౌలిక వసతుల కల్పన.. తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యా వేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో పాఠశాలల పని తీరు మెరుగు
విద్యార్థుల ప్రతిభా పాటవాలు ఏటా పెరుగుతున్నాయా? లేదా? అభ్యసన ఫలితాలు మరింత మెరుగ్గా రావడానికి ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? తదితర విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర విద్యా శాఖ నివేదికలు రూపొందిస్తోంది. చదువులలో నాణ్యత గుర్తించడానికి విభిన్న ఇండికేటర్స్‌ను నిర్ధారించింది. 2018–19 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల్లో నాణ్యత మెరుగు పడిందని నివేదిక పేర్కొంది.

1000 మార్కుల సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 811 పాయింట్లు సాధించి లెవల్‌–4 (గ్రేడ్‌–1)లో నిలిచింది. 2018–19 విద్యా సంవత్సరంలో 725 పాయింట్లతో లెవల్‌–6 (గ్రేడ్‌–3)లో ఉండింది. అంతకు ముందు 2017–18లో కూడా 728 పాయింట్లతో లెవల్‌–6 (గ్రేడ్‌–3)లోనే ఉండింది. కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల స్కోరు ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో 12వ స్థానం దక్కింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 772 మార్కులతో 18వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాలను పంజాబ్, తమిళనాడు, కేరళ దక్కించుకున్నాయి.

ఐదు ప్రామాణికాలతో ఎంపిక
కేంద్ర విద్యాశాఖ స్థూలంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకొని 1000 పాయింట్ల స్కోర్‌తో ఆయా రాష్ట్రాలకు స్థానాలను నిర్ధారిస్తోంది. 
1. అభ్యాస ఫలితాలు, నాణ్యత : ప్రభుత్వ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతి విద్యార్థుల భాష (తెలుగు/ఇంగ్లిష్‌/హిందీ), గణితంలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అంశాన్ని నిర్ధారించారు. 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 180 మార్కులు కేటాయించారు.
2. పాఠశాల అందుబాటులో ఉన్న తీరు : ప్రైమరీ, సెకండరీ స్థాయిలో విద్యార్థుల కనిష్ట చేరికల నిష్పత్తి,   ప్రాథమిక–సెకండరీ స్థాయిలో విద్యార్థులు కొనసాగుతున్న తీరు, ప్రైమరీ నుంచి అప్పర్‌ ప్రైమరీకి, అక్కడ నుంచి సెకండరీలోకి చేరుతున్న విద్యార్థుల శాతం, చదువుకు దూరంగా ఉంటున్న బడి ఈడు పిల్లల సంఖ్య.. అంశాల ఆధారంగా 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 80 మార్కులు కేటాయించారు.
3. మౌలిక సదుపాయాలు : పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 150 మార్కులు కేటాయించారు.
4. సమానత (ఈక్విటీ) : ఓసీ, ఎస్సీ, ఎస్టీ, గ్రామీణ, పట్టణ, బాలికలు, బాలుర మధ్య అభ్యసన ఫలితాలను పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 230 మార్కులు కేటాయించారు.
5. పాఠశాల నిర్వహణ : విద్యా సంస్థల నిర్వహణ, బోధనాంశాల ప్రణాళిక రూపకల్పన తీరును పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 360 మార్కులు కేటాయించారు.

రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు 
2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కింద అర్హులైన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

జగనన్న విద్యా కానుక కింద చదువులకు అవసరమైన వస్తువులు అందిస్తూ కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టారు. పునాది విద్యను బలోపేతం చేసేందుకు ఫౌండేషన్‌ స్కూళ్లనూ ఏర్పాటు చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు.

తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్‌ ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ భాగస్వామ్యంతో విద్యార్థులకు అత్యుత్తమ కంటెంట్‌ను సమకూరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు అందిస్తూ డిజిటల్‌ విద్య ద్వారా ప్రమాణాలు పెంచేలా కార్యాచరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కనుక రాష్ట్రం ‘పెర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌’లో దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నది అక్షర సత్యం.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-tops-education-sector-cm-ys-jagan-programs-1467235