విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందించే వాల్‌ ఆర్ట్‌

  • నాడు–నేడు పాఠశాలల్లో గోడలపై పాఠ్యాంశాల బొమ్మలు
  • చిత్రాలను చూపిస్తూ పాఠాలు బోధిస్తూ టీచర్లు 

ప్రభుత్వ పాఠశాలల్లోకి అడుగుపెడితే చాలు అక్కడ గోడలపై ఉన్న బొమ్మలే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నట్టు ఉంటాయి. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందిస్తూ పాఠాలను గుర్తుపెట్టుకునేలా ప్రభావితం చేస్తున్నాయి. అందమైన రంగుల్లో ఒక్కసారి చూస్తే మర్చిపోలేని విధంగా తరగతి గదుల్లో, బయట గోడలపై రూపొందించిన పాఠ్యాంశాల చిత్రాలు ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. నాడు–నేడు పేరుతో అభివృద్ధి చేసిన పాఠశాలలు వీటికి వేదికగా నిలుస్తున్నాయి.  

భీమవరం(ప్రకాశం చౌక్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వాటి రూపురేఖలనే మార్చేసింది. నాడు అధ్వానంగా ఉన్న పాఠశాలలు నేడు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ఏర్పాటుచేసిన అధునాతన వసతులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల గేటు దగ్గర నుంచి తరగతి గదుల వరకు అన్నిచోట్లా వేయించిన పాఠ్యాంశాల బొమ్మలు విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.

నాడు–నేడు ద్వారా తొమ్మిది రకాల పనులు పాఠశాలల్లో చేపట్టగా అందులో ముఖ్యమైనది గోడలపై వేసిన చిత్రాలు. వీటి ద్వారా పాఠశాల తరగతి గదుల్లో, బయట గోడలపై ముఖ్యమైన పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించారు. విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఈ బొమ్మలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. టీచర్లు కూడా తరగతి గదుల్లోని బొమ్మల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి రేకెత్తించేందుకు కృషిచేస్తున్నారు. ఈ బొమ్మలు విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా చేయడంలో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. 

ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వ్యయం
పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు–నేడు ఫేజ్‌–1లో సుమారు 1100 పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఒక్కో పాఠశాలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేలతో ఆయా పాఠశాలల్లో గోడలపై చిత్రాలు వేయించారు.  

అంశాలివీ… 
పాఠశాలల తరగతి గదుల గోడలపై అక్షరాలు, అంకెలు, మానవ శరీర నిర్మాణం, జీర్ణకోశ, ప్రకృతి, మ్యాప్‌లు, అంతరిక్షం తదితర వాటిని వేయగా బయట గోడలపై స్వచ్ఛభారత్, కవులు, రచయితలు, క్రీడలు, ట్రాఫిక్, యోగా ఉపయోగాలు, శరీర అంతర్గత భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు తదితరాల నిర్మాణాలు, జాతీయ జెండా, దేశ నాయకుల చిత్రాలు, జాతీయ చిహ్నాలు తదితరాలను బొమ్మల రూపంలో వేయించారు.  

ఉపయోగాలివీ…
►పాఠశాలలపై విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెరుగుతుంది
►విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతుంది.
►ఆహ్లాదకర వాతావరణంలో, ఉత్సాహంగా పాఠాలు నేర్చుకుంటారు. 
►బోధన, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయి. 
►చదివిన పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయి. 
►విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. 
►ముఖ్యంగా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తిని పెంచుతాయి.  

ఎంతో ప్రభావితం చేస్తున్నాయి
జిల్లాలో నాడు–నేడు ఫేజ్‌–1లో సుమారు 1100 పాఠశాలలను అభివృద్ధి చేశాం. వాటిలో చేపట్టిన తొమ్మిది కాంపోనెంట్‌ పనుల్లో ఒకటి గోడలపై చిత్రాలు. తరగతి గదుల లోపల, బయట పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో వేయించాం. అవి విద్యార్థుల్లో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నాయి. బొమ్మలు విద్యార్థుల్లో పాఠశాలకు రావాలనే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంచుతున్నాయి. చదువుకున్న పాఠాలు ఎప్పటికీ మార్చిపోకుండా గుర్తుండేలా దోహదపడుతున్నాయి. 
– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు 

పాఠాలను గుర్తుపెట్టుకుంటున్నారు 
పాఠశాల తరగతి గదుల్లో వేసిన పాఠ్యాంశాల బొమ్మల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటే వారు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. బొమ్మల ద్వారా చెప్పే పాఠాలను ఎప్పటికీ మర్చిపోలేరు. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను చిత్రాలుగా గోడలపై వేయడం చాలా బాగుంది. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కొన్ని చిత్రాలు వారిలో విజ్ఞానాన్ని, అవగాహనను పెంచుతుంటే మరికొన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తున్నాయి.
 – ఎ.రాణీ నాగరత్నం, ఉపాధ్యాయురాలు, మహాత్మాగాంధీ ప్రాథమిక పాఠశాల, భీమవరం 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/nadu-nedu-program-changed-face-school-ap-1394057