విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా

బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,925 కోట్లను ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. విద్యుత్‌ సౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్‌సీ రూ.31,346 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా మన డిస్కంలు రూ.26,421 కోట్లను మాత్రమే ఖర్చు చేశాయని చెప్పారు.

ఆదా అయిన రూ.4,925 కోట్లలో రూ.3,373 కోట్లను వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా ట్రూ డౌన్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల్ల దాదాపు 18.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఉచిత విద్యుత్‌ పథకానికి ప్రభుత్వం రూ.7,714.21 కోట్ల సబ్సిడీ అందించడంతోపాటు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 2024 నుంచి దశలవారీగా కొనుగోలు చేయాలని భావిస్తోందని చెప్పారు.

దేశంలోనే తొలి సాంకేతికత
విద్యుత్‌ డిమాండ్‌ను ఒకరోజు ముందుగానే అంచనా వేసేందుకు ‘డే ఎ హెడ్‌ ఎలక్ట్రిసిటీ ఫోర్‌ కాస్టింగ్‌ మోడల్‌’ను మన విద్యుత్‌ సంస్థలు రూపొందించాయని శ్రీకాంత్‌ తెలిపారు. ఆర్టి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతతో పనిచేసే ఈ వ్యవస్థ దేశంలోనే మొదటిదని, దీనివల్ల విద్యుత్‌ సరఫరా, గ్రిడ్‌ నిర్వహణ వంటి అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

విద్యుత్‌ పంపిణీ నష్టాలు గత ఏడాది 7.50 శాతం ఉండగా, 2021–22లో ఇప్పటివరకు 5 శాతానికి తగ్గాయని చెప్పారు. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్‌ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా.. 2021–22 నవంబర్‌ నాటికి 11 శాతానికి తగ్గించగలిగామన్నారు. కాగా, విద్యుత్‌ సౌధలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. 

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/savings-rs-4925-crore-power-purchases-1430119