విద్యుత్ రంగంలో 2,342.45 కోట్లు ఆదా

  • చౌక విద్యుత్తు కొనుగోళ్లతో దేశంలో రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌
  • కొనుగోళ్లలో ‘పవర్‌’ ఫుల్‌ ట్రెండ్‌
  • అందుబాటులోకి మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ
  • నిమిషాల్లోనే బహిరంగ మార్కెట్లో కొనుగోలు
  • గత సర్కార్‌ అప్పులు మిగిలిస్తే… ఇప్పుడు భారీగా ఆదా 

  గత సర్కారు హయాంలో అప్పుల పాలై దివాలా దశకు చేరిన విద్యుత్‌ సంస్థలు ఇప్పుడు పొదుపు చర్యలు పాటించడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడుతున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో గత రెండేళ్లలో ఏకంగా రూ.2,342.45 కోట్లు ఆదా చేసి దేశంలోనే రికార్డు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సైతం ప్రశంసించింది. పూర్తి పారదర్శకంగా, చౌక విద్యుత్‌ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే దీన్ని సాధించినట్లు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి వెల్లడించారు. సరికొత్త మైలురాయిని చేరుకోవడంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

  యూనిట్‌ రూ.3.12కే కొనుగోలు
  ఇంధనశాఖలో విద్యుత్‌ కొనుగోళ్లు అత్యంత కీలకం. పైసా తేడా వచ్చినా భారం రూ.కోట్లల్లో ఉంటుంది. గత సర్కారు దీన్ని గుర్తించకపోవడం వల్లే డిస్కమ్‌లు నష్టాల బాట పట్టాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) మొట్టికాయలేసింది. ఈ తరహా పొరపాట్లు జరగకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

  గత రెండేళ్లుగా చౌక విద్యుత్‌ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీని ద్వారా రూ.2,342.45 కోట్లు ఆదా అయింది. 2019–20లో 3,393 మిలియన్‌ యూనిట్లు, 2020–21లో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. సరఫరా చార్జీలు కలిపి సగటున యూనిట్‌ రూ.3.12 చొప్పున వెచ్చించారు. నిజానికి ఈ విద్యుత్‌ కొనడానికి యూనిట్‌కు రూ.4.55 వరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించినా అంతకన్నా తక్కువకే విద్యుత్‌ సంస్థలు కొనుగోలు చేయడం గమనార్హం.

  మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీతో..
  చౌక విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ ట్రాన్స్‌కో, గ్రిడ్‌ నిర్వహణ విభాగం దేశంలోనే తొలిసారిగా మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) టెక్నాలజీని అందిపుచ్చుకుంది. గతంలో 24 గంటల ముందు కొనాల్సిన విద్యుత్‌కు ఆర్డర్లు ఇచ్చారు. సరికొత్త టెక్నాలజీ వల్ల కేవలం 15 నిమిషాల్లోనే డిమాండ్‌ను పసిగట్టి అవసరమైన మేరకు ఆర్డర్‌ ఇవ్వగలిగారు. మరోవైపు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వ్యవస్థను ట్రాన్స్‌కో ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా  విద్యుత్‌ డిమాండ్, లభ్యతను సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించి వాస్తవ డిమాండ్, లభ్యతను అంచనా వేశారు. దీనివల్ల విద్యుత్‌ వృథాను అరికట్టడంతోపాటు ఎక్కువ ధరకు కొనుగోళ్లను నియంత్రించగలిగారు.

  ఖరీదైన విద్యుత్‌కు కత్తెర..
  625 మెగావాట్ల ఖరీదైన విద్యుత్‌ను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ద్వారా తీసుకుంటుండగా దీన్ని కేంద్రానికి అప్పగించారు. ఫలితంగా డిస్కమ్‌లపై రూ. 1,007 కోట్ల భారం తగ్గింది. గతంలో కేంద్ర విద్యుత్తు గ్రిడ్‌ మూడు నెలలకు ఒకసారి ఏపీ డిస్కంల నుంచి సీటీయూ (సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ), పీవోసీ (పాయింట్‌ ఆఫ్‌ కనెక్షన్‌) చార్జీలు వసూలు చేసేది. రాష్ట్ర ఇంధన శాఖ ఒత్తిడి మేరకు కేంద్రం మార్పులు చేసింది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు  రూ.350 కోట్లు ఆదా అయింది. 

  ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌
  – కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌
  ‘విద్యుత్తు కొనుగోళ్లలో భారీ మొత్తంలో ప్రజల సొమ్మును ఆదా చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కోవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది’ 

  విద్యుత్‌ శాఖ బలోపేతమే లక్ష్యం
  – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి
  ‘ఆంధప్రదేశ్‌ సాధించిన విజయం ప్రశంసనీయం. విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ముందుకెళ్లాలి’