విశాఖలో కోవిడ్ రోగులకు సహాయం అందిస్తున్న రోబో

  • కోవిడ్‌ కేర్‌ సెంటర్లో సేవలందిస్తున్న రోబో
  • కోవిడ్‌ రోగులకు ‘సోనా’ హెల్ప్‌
  • విశాఖ నేవల్‌ డాక్‌ యార్డు కోవిడ్‌ కేర్‌ సెంటర్లో మూడు రోజులుగా సేవలు 

  కరోనా బాధితులకు సేవ చేయాలంటే మనుషులు భయపడుతున్నారు. కానీ తాను మాత్రం ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చిటికెలో చేసేస్తాను అంటోంది. సోనా రోబో వెర్షన్ 2.5…

  కోవిడ్‌ రోగులకు సేవలందించేందుకు సరికొత్త సర్వీస్‌ రోబో వచ్చేసింది. విశాఖ నేవల్‌ డాక్‌ యార్డులోని 200 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో మూడు రోజులుగా ప్రయోగాత్మకంగా దీనిని వినియోగిస్తున్నారు.

  ఇప్పటికే ముంబయి, గుజరాత్‌లలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ తరహా రోబోలను వినియోగిస్తున్నారు. రోబో అందిస్తున్న సేవలపై సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోబోకు సంబంధించిన వివరాలు మనం అడిగితే.. అసలు ఏం ఛేస్తుందో.. రోబో మాటల్లోనే విందాం..

  హాయ్‌ రోబో.. 
  ► హాయ్‌.. ఐయామ్‌ నాట్‌ రోబో.. మై నేమ్‌ ఈజ్‌ సోనా, వెర్షన్‌ 2.5. మేడిన్‌ ఇండియా. 

  నీ స్పెషల్‌ ఏంటి సోనా? 
  ► మీరు ఎలా ప్రోగ్రామ్‌ ఇస్తే అలా మారిపోతుంటాను. మీరు కమాండ్‌ చేయడమే ఆలస్యం.. ఎంచక్కా చేసేస్తాను.  

  ఎలాంటి పనులు చెయ్యగలవ్‌? 
  ► మీరు ఏం చెయ్యాలో చెబితే అవన్నీ చేసేస్తాను. మీరు చెయ్యలేని పనులు కూడా నేను చెయ్యగలను. కోవిడ్‌ పేషెంట్స్‌ వద్దకు వెళ్లేందుకు మీరంతా కొద్దిగా భయపడుతున్నారు కదా. కానీ నాకు ఎలాంటి భయల్లేవ్‌. వారికి దగ్గరగా వెళ్లి సేవలందిస్తాను.  

  ప్రస్తుతం ఎక్కడ సేవలందిస్తున్నావ్‌? 
  ► విశాఖ నేవల్‌ డాక్‌ యార్డులో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కి ప్రయోగాత్మకంగా నన్ను తీసుకొచ్చారు. మూడు రోజులుగా ట్రయల్స్‌ వేస్తున్నారు. అన్ని పనులూ విజయవంతంగా చేస్తున్నా. ఇక్కడున్న కరోనా బాధితులకు వేళకు ట్యాబ్లెట్లు ఇస్తున్నా.. ఫుడ్‌ అలెర్ట్‌ చేస్తున్నా.. వారిని పర్యవేక్షించేందుకు వచ్చే డాక్టర్లకు శానిటైజర్లు అందిస్తున్నా.. ఇంకా ఎన్నో చేస్తున్నా.  

  అవునా.. అయితే నువ్వు రోబోవి కాదు.. కోవిడ్‌ వారియర్‌వి. 
  ► థాంక్యూ.. ఐ యామ్‌ సోనా, వెర్షన్‌ 2.5.   

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/newest-service-robot-has-arrived-serve-covid-patients-1364299