విశాఖ తీరానికి అత్యాధునిక భద్రత

  • శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న 5 ఇండియా ఆయుధాలు 
  • తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు
  • గంటకు 280 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న ఎమ్‌కే–3 
  • దేశీయ పరిజ్ఞానంతో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ తయారీ

  తీర రక్షణలో రెప్ప వాల్చకుండా నిమగ్నమైన తూర్పు నౌకాదళం తన శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ దుర్బేధ్యమైన శక్తిగా మారుతోంది. తాజాగా అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు నౌకాదళ అమ్ముల పొదిలో చేరడంతో తూర్పు తీర భద్రత మరింత పటిష్టమైంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాఫ్టర్లు బంగాళాఖాతంలో నిరంతరం పహారా కాయనున్నాయి. 

  విశాఖ స్థావరంగా..

  రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకుల హయాం నుంచే తూర్పు తీరం కీలకమైన ప్రాంతం. తూర్పు నౌకాదళం విశాఖపట్నం ప్రధాన స్థావరంగా ఏర్పాటైంది. మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహాసముద్రం వరకూ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్‌బన్‌ నుంచి దక్షిణాన గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకూ విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కి.మీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ విస్తరించి ఉంది. తీరంలో 13 మేజర్‌ పోర్టులున్నాయి. కేంద్ర ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీస్‌ కూడా విశాఖలోనే ఏర్పాటైంది. 

  యుద్ధ నౌకలు, సబ్‌ మెరైన్లు..

  స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో భారతీయ నౌకాదళం ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కిల్తాన్, ధ్రువ్‌ మొదలైన యుద్ధ నౌకల్ని సమకూర్చుకుంటూ దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మూడు సూపర్‌ ఫాస్ట్‌ హెలికాఫ్టర్లు చేరడంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది.

  గంటకు 280 కి.మీ వేగంతో…

  నిఘా వ్యవస్థలో రాటుదేలేందుకు కొత్తగా ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు మూడింటిని భారత నౌకాదళం విశాఖకు కేటాయించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఏఎల్‌హెచ్‌ ఎమ్‌కే–3 పేరిట ఈ హెలికాఫ్టర్లని తయారు చేశారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌లు ఇప్పటి వరకూ ఎమ్‌కే–1 వేరియంట్‌ హెలికాఫ్టర్లని వినియోగిస్తున్నాయి. ఎమ్‌కే–3 వేరియంట్స్‌తో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఏఎల్‌హెచ్‌ ఎమ్‌కే–3 హెలికాఫ్టర్లలో గ్లాస్‌ కాక్‌పిట్‌ మాత్రమే కాకుండా హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఆర్కిటెక్చర్‌ డిస్‌ప్లే సిస్టమ్‌(ఐఎడీఎస్‌) ఉంది.ఇందులో శాఫ్రాన్‌ ఆర్డిడెన్‌ 1హెచ్‌1 ఇంజిన్స్‌ ఉండటంతో గంటకు 280 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. ఎమ్‌కే–3లో అధునాతన ఏవియానిక్స్‌ ఉండటం వల్ల వాతావరణానికి అనుగుణంగా పనితీరు మార్చుకొని ప్రయాణం చేయగలవు. వీటికి ఆధునిక నిఘా రాడార్, ఎలెక్ట్రో ఆప్టికల్‌ పరికరాలు అమర్చారు. దీనివల్ల పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ సుదూర శోధన, శత్రుమూకల నుంచి రక్షణ అందిస్తూ సముద్ర నిఘా వ్యవస్థని పటిష్టం చేయనున్నాయి. ఎమ్‌కే–3లో భారీ మెషీన్‌గన్‌ కూడా అమర్చారు.
  అత్యవసరాల కోసం మెడికల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ కూడా ఎమ్‌కే–3లో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి ఆస్పత్రులకు తరలించేందుకు ఇది దోహదపడుతుంది.

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/eastern-navy-inducts-advanced-light-helicopter-vizag-1372520