అక్షరం ముక్కరాని గిరిజనులకు గ్లోబల్‌వార్మింగ్ అంటే తెలియకపోవచ్చు. కానీ, అరుదైన ములస వెదురుతో ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తుల్ని తయారుచేస్తూ.. అసలుసిసలు పర్యావరణ హితులుగా సేవలు అందిస్తున్నారు. మరోవైపు మహిళలు ఉపాధినీ పొందుతున్నారు. బొంగులో చికెన్ ఐడియా వచ్చిందే గిరిజనుల నుంచి. ఇది చాలామందికి తెలియదు. ‘ఒకప్పుడు మా వాళ్లు వేటకు వెళ్లేవాళ్లు. కొన్ని జంతువులు దొరికేవి. ఆ మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి.. వెదురు బొంగుల్లో కూర్చి.. మంటపై కాల్చేవాళ్లు. వెదురులో సహజంగా ఉండే ఉప్పు వల్ల.. మాంసం మరింత రుచికరంగా తయారయ్యేది. అటవీ ప్రాంతాల్లో ఇది కొన్నేళ్ల నుంచి వస్తున్న వంట ప్రక్రియ..’ అంటారు చింతూరు గిరిజన మహిళలు.
రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ఏజెన్సీ మీదుగా 180 కిలోమీటర్లు వెళితే.. దట్టమైన అడవి కనిపిస్తుంది. రంపచోడవరం, మారేడుమిల్లి మధ్య దేవరాపల్లికి చేరేసరికి.. వెదురు పొదలు స్వాగతం పలుకుతాయి. ముదురాకు పచ్చ ములస వెదురు ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇదొక అరుదైన జాతి. బొంగులో చికెన్ వండేది ఈ వెదురుతోనే. ములస వెదురు గడ నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకు వెళుతుంది. ప్రతి కణుపు వద్ద వెడల్పయిన రేక పెరుగుతుంది. వాటిని వెదురు మట్టలు అంటారు. ఈ రేకలను అక్టోబరు, నవంబర్లలో మాత్రమే తెంచవచ్చు. వాటిని కాసేపు నీళ్లలో నానబెడతారు. బ్రష్‌తో దుమ్ముధూళిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత, ప్రత్యేక యంత్రంతో కప్పులు, ప్లేట్లు తయారు చేస్తారు. చింతూరు గ్రామంలో పాతికమంది మహిళలు ఇలాంటి వైవిధ్యమైన పనులెన్నో చేస్తున్నారిప్పుడు. ‘అడవే మా లోకం. ఇక్కడే ఉపాధిని వెదుక్కోవాలి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. వెదురు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. ఇదొక మంచి మార్పు’ అంటుంది కుంజ అర్జమ్మ.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా… పర్యావరణ ప్రియమైన ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తోంది ప్రపంచం. ఎకోఫ్రెండ్లీ వస్తువులకు గిరాకీ పెరిగింది. వెదురు ఉత్పత్తుల ప్రాధాన్యం రెట్టింపైంది. ముఖ్యంగా గిరిజనుల స్వయం ఉపాధికి ఇదో చక్కటి మార్గమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ‘ఆషా’ స్వచ్ఛంద సంస్థ మార్గదర్శిగా నిలుస్తోంది. వెదురు రేకలతో కప్పులు చేయొచ్చన్న సంగతి గిరిజనులకు తెలీదు. ఆషా కార్యకర్తలు అడవుల్లోకి వెళ్లి.. గిరిజనులకు శిక్షణ ఇచ్చారు. దగ్గరుండి వాళ్లతో తయారు చేయించారు. చింతూరు మండలంలోని తులసిపాకల, సిరసనపల్లి, తులుగొండ గ్రామాల్లోని మహిళలు ఆ కళలో నైపుణ్యం సంపాదించారు. అంతా హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ, రూరల్ డెవలప్మెంట్ టెక్నాలజీ పార్క్, అన్నపూర్ణ కాటేజ్ ఇండస్ట్రీస్‌లో కొన్ని రోజులు సాంకేతిక శిక్షణ తీసుకున్నారు. ‘వెదురు రేకలతో ఏడాది పొడవునా మాకు ఉపాధి లభిస్తోంది..’ అంటారు ఆ మహిళలు అనందంగా.
వెదురు ఉత్పత్తుల్లో ఎంత వైవిధ్యం ఉన్నా, ఒక్కోసారి అనుకున్నంత మార్కెట్ ఉండదు. ఒక కప్పు తయారు చేయాలంటే రూపాయి ఖర్చు అవుతుంది. ప్లేట్ చేయాలంటే ఆరు రూపాయల ధర పెట్టాల్సి వస్తుంది. అందుకే, అన్నపూర్ణ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం చేసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోందీ సంస్థ. ఇద్దరు మహిళలు ఒక హైడ్రాలిక్ యంత్రం మీద రోజుకు 1500 నుంచి 2000 ప్లేట్లను తయారుచేస్తారు. కప్పులైతే 1200 దాకా చేస్తున్నారు. ‘ఒకప్పుడు మేము కూడా ప్లాస్టిక్ వస్తువులనే వాడేవాళ్లం. ఇప్పుడు వెదురు ప్లేట్లు, కప్పులకే అలవాటు పడ్డాం…’ అంటారు దేవరాపల్లి, చింతూరు వాసులు.
లాభాలు అనేకం..
వెదురు రేకలను చిన్నచిన్న ఉత్పత్తులకే కాదు, ఇంటి పైకప్పులకూ వాడొచ్చు. తడికలు అల్లడానికి కూడా పనికొస్తాయి. ఇక, వెదురులో ఆయుర్వేద ఔషధ గుణాలు బోలెడు. ఆకులు, కాండం, వేళ్లు, పువ్వులు, వెదురు బియ్యం.. ఇలా అన్నీ ఉపయోగపడేవే! కొన్ని చోట్ల వెదురు చిగుళ్లతో ఊరగాయ పెడతారు. అడ్డతీగల ప్రాంతంలోని కొన్ని తెగల వాళ్లు వెదురు గింజలతో కల్లు సారా కాస్తారు. ఒక్క రంగు మినహా గోధుమలను పోలిన వెదురు గింజలను దంచి.. పై పొట్టు తీసి రొట్టెలు కాలుస్తారు. వెదురు చిగుళ్ల కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిదని గిరిజనుల నమ్మకం. తూరుపు కనుమల్లో దొరికే మగ వెదురును పోలీసులు లాఠీల తయారీకి ఉపయోగిస్తారు. ఒక్క వెదురే కాదు, ఇప్పపువ్వు, గింజలతో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు గిరిజనులు. అంతా ‘ఆషా’ చేతి చలవే.