వైఎస్సార్‌ చేయూత​‍తో మా కుటుంబానికి భరోసా

  • గుంటూరు జిల్లా ముప్పాళ్ల కు చెందిన తుపాకుల కుమారికి జగనన్న జీవక్రాంతి పథకం కింద సన్నజీవాల యూనిట్‌ ను. పంపిణీ చేస్తున్న పశు సంవర్దక శాఖాధికారులు
  • ప్రభుత్వ పథకాలతో మెరుగుపడుతున్న లబ్ధిదారుల జీవన ప్రమాణాలు
  • జగనన్న పాల వెల్లువ, జీవక్రాంతి ద్వారా లక్ష్యానికి మించి యూనిట్లు మంజూరు
  • సొంత కాళ్లపై నిలబడుతున్న మహిళలు
  • పశువుల పెంపకంతో భరోసా లభించిందంటూ సంతోషం

  కింది ఉన్న మహిళ పేరు పిన్నబోయిన అంజమ్మ. గుంటూరు జిల్లా ఈపూరు మండలం చిట్టాపురానికి చెందిన ఈమెకు పాడి పశువులే జీవనాధారం. ఆమె వద్దనున్న రెండు గేదెలు కొంతకాలం కిందట అనారోగ్యం తో మృతి చెందాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ఆదుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పాడి గేదెల కోసం దరఖాస్తు చేసుకుంది. ‘జగనన్న పాలవెల్లువ’ పథకం కింద ఒక్కొక్కటి రూ.55 వేల విలువైన 2 మేలు జాతి గేదెలను అధికారులు ఆమెకు ఇప్పించారు.

  ప్రస్తుతం ఒకటి చూడుపోయగా, మరొకటి 4 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తోంది. లీటర్‌కు రూ.65 వరకు వస్తున్నాయని.. తమ కుటుంబానికి భరోసా లభించిందంటూ అంజమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా ఆమె ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో భరోసా లభించింది. వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఆర్థికంగా బలపడుతూ తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

  సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. లబ్ధిదారులకు ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే అండగా నిలిచి ‘జగనన్న పాల వెల్లువ’ కింద మేలు జాతి ఆవులు, గేదెలు.. జగనన్న జీవ క్రాంతి ద్వారా మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్లు, మేకపోతులను అందిస్తోంది. వాటి పెంపకం ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు పెరిగేలా, ఆర్థిక పురోగతి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. 

  లక్ష్యానికి మించి యూనిట్ల మంజూరు..
  పాడి పశువులకు సంబంధించిన జగనన్న పాల వెల్లువ పథకం కింద 1,13,008 యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో 1,13,854 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిచ్చింది. ఇందులో 78,003 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 47,387 మంది, ఎస్సీలు 26,883 మంది, ఎస్టీలు 3,192 మంది, ఓసీలు 494 మంది, మైనార్టీలు 47 మంది ఉన్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన పది జిల్లాల్లో 100 శాతానికి మించి యూనిట్లు మంజూరు చేశారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 6,405 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 8,504 యూనిట్లు మంజూరయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 9,815కు గానూ 4,321 యూనిట్లు మంజూరు చేశారు.

  అన్ని వర్గాలకూ.. 
  మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్ల పిల్లలకు సంబంధించిన జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా 72,179 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 71,576 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇచ్చింది. వాటిలో 46,342 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 27,183 మంది, ఎస్సీలు 11,927 మంది, ఎస్టీలు 6,902 మంది, మైనార్టీలు 47 మంది, ఓసీలు 283 మంది ఉన్నారు. వైఎస్సార్, విశాఖ, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్ష్యానికి మించి యూనిట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21,113 యూనిట్లు మంజూరు చేయగా, ఇప్పటికే 15,512 యూనిట్ల సన్నజీవాలను లబ్ధిదారులకు అందించారు. ఒక్కొక్క యూనిట్‌లో 14 గొర్రె పిల్లలు లేదా 14 మేక పిల్లలతో పాటు పొట్టేలు లేదా మేకపోతు ఉంటాయి. మొత్తంగా 15 సన్నజీవాలుంటాయి.

  మా కుటుంబానికి ఆసరా దొరికింది..
  నేను వైఎస్సార్‌ చేయూత సొమ్ములతో మేకలు, గొర్రెలు తీసుకుంటానని అధికారుల ను అడిగాను. వారు కూడా వెంటనే స్పందించి.. జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా 14 మేక పిల్లలు, ఒక మేకపోతును ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వీటి వల్ల మా కుటుంబానికి ఆసరా దొరికింది.     
  – తుపాకుల కుమారి, ముప్పాళ్ల, గుంటూరు జిల్లా

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/woman-beneficiar-happy-ysr-cheyutha-scheme-guntur-district-1381572