వైఎస్సార్‌ బీమాలో నూతన మార్గదర్శకాలు

  పేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు సత్వరమే ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి సహజమరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు (నామినీ)కి రూ. లక్ష పరిహారాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము ఆదివారం ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఉపశమనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ బీమా పథకానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

  18 నుంచి 70 ఏళ్ల వయసు వారై ఉండి, ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్‌ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీముకు నోడల్‌ ఏజెన్సీగా కార్మిక శాఖ, ఇంప్లిమెంటింగ్‌ (అమలు) ఏజెన్సీగా గ్రామ సచివాలయ/వార్డు సచివాలయ విభాగం పనిచేస్తుంది. బీమా పరిధిలోకి దారిద్య్ర రేఖ దిగువన ఉన్న అన్ని కుటుంబాలు వస్తాయి. వైఎస్సార్‌ బీమా పథకంపై ఇటీవల సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ పథకం నుంచి కేంద్రం వైదొలిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని భరిస్తోంది. అయినప్పటికీ బీమా కంపెనీలు, బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా వైఎస్సార్‌ బీమాలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు.  

  తాజా మార్గదర్శకాలు ఇవే
  ► లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారు. లబ్ధిదారులను నిర్ధారించే అధికారం (రిజిçష్ట్టరింగ్‌ అథారిటీ) వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు ఇస్తారు. ఈ జాబితాను కార్మిక శాఖ పరిశీలిస్తుంది.
  ► వైఎస్సార్‌ బీమా పరిధిలోకి రావాలంటే 18 ఏళ్ల పైనా, 70 ఏళ్లలోపు ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. అతను లేదా ఆమె కుటుంబ పోషణ చేసే వారై ఉండాలి.
  ► వయసు నిర్ధారణ విషయంలో నోడల్‌ ఏజెన్సీ సంతృప్తి చెందాలి.
  ► ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్‌ బీమా రిజిస్ట్రేషన్‌ సదుపాయం ఉంటుంది.
  ► లబ్ధిదారుల నమోదు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్‌డీఏ పీడీ పరిష్కరిస్తారు.
  ► సహజ మరణం చెందిన వారికి ఇచ్చే లక్ష రూపాయలు చట్టబద్ధమైన వారసుడికి చెందే విషయమై గ్రామ/వార్డు వలంటీర్లే పర్యవేక్షణ చేస్తారు.
  ► ప్రమాదవశాత్తు మరణం, లేదా శాశ్వత వైకల్యం గుర్తించే విషయంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ పర్యవేక్షణ చేస్తుంది. 
  ► జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని జాయింట్‌ కలెక్టర్లు (సంక్షేమం) నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబ పోషకుడు మరణించిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
  ► నామినీ లేదా వారసులకు చెల్లింపులు ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాకు (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌–డీబీటీ) చేస్తారు.
  ► పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కన్వీనర్‌గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉంటారు.
  ► రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి కార్మిక ఉపాధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గానూ, మరో 9 మంది వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు.  

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-govt-immediate-assistance-affected-families-1374407