కృష్ణా నదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో రూ.368 కోట్లతో నిర్మించనున్న ‘వైయస్ఆర్ - వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం పంట పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. రూ.368 కోట్ల వ్యయంతో వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టింది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని దృఢసంకల్పంతో లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుండి ఇక్కడి ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదని… దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందేలా నిర్మాణాలు చేపడుతూ.. డీబీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా ‘వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం’ ద్వారా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కష్టాలు తీరి.. ఈ ప్రాంతానికి మేలు జరగాలని సీఎం ఆశిస్తున్నట్లు తెలిపారు.