వైఎస్సార్ చేయూత

అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా.. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన మహిళలను ఉద్దేశించి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది ఖాతాల్లో 18 వేల 750 చొప్పున జమ అవుతుంది.ఏడాదికి రూ.18,750ల చొప్పున జమ చేస్తారు. నాలుగేళ్లలో ఒక్కో అక్కాచెల్లెమ్మకు మొత్తం రూ.75వేల ఆర్థిక సాయం అందనుంది.

ఆసరా, చేయూత ద్వారా నగదు మాఫీ చేయడంతో పాటు మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా రుణాలు కల్పిస్తోంది. అక్కాచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి అతిపెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వైఎస్సార్ చేయూత పథకం కోసం ఏపీ బడ్జెట్‌లో 4వేల 7వందల కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 17 వేల కోట్లకు పైగా లబ్ది పొందనున్నారు.

అర్హతలు:
-మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.

-మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు (పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).

-కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.) , పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.

-కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో, టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణిస్తారు.

-కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.

-ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

-ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకొనే విధానము:

-అర్హత కల్గిన వారు సమగ్ర కులధృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

-దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి రూ.18,750/- ప్రభుత్వముచే అందించబడుతుంది.