రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ

రైతుల ఖాతాల్లో నగదు జమ..

వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. 

గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గమనించండి: సీఎం జగన్‌

మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా?. రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?.

ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గమనించాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కొల్లేరులో రీ సర్వేకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు. మన ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు. రైతులకు మంచి చేయాలని మనసుతో ఆలోచించే ప్రభుత్వమిది. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నాం.

ఎన్నడూ లేని విధంగా..

రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్‌ అన్నారు. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశామన్నారు. ఎన్నడూలేని విధంగా మూడేళ్లలో రైతులకు లక్షా 10వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ  రోజు రూ.5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం అన్నారు.16 May 2022, 12:08

ఖరీఫ్‌ పనులు మొదలు కాక మునుపే రైతు భరోసా: సీఎం జగన్‌

ఖరీఫ్‌ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేలండర్‌ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామన్నారు.

ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది: మంత్రి కాకాణి

వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద  50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దక్కుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి.. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ముంగిటకే ఎరువులు, విత్తనాలు వంటి సంబంధిత సేవలను తీసుకొచ్చారన్నారు.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-releases-ysr-rythu-bharosa-amount-may-16th-live-updates