వైఎస్సార్ మత్స్యకార భరోసా

సముద్రంపై మరపడవలు మరియు తెప్పలపై చేపలు పట్టే మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ మత్స్యకార భరోసా ప్రకటించింది. ఈ పధకం ద్వారా సంవత్సరానికి రూ.10,000/- ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీంతో మొత్తం లక్షా  9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరింది. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల జీవితాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాల దగ్గరగా పరిశీలించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ మార్పు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

దీనితో పాటు మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే ఇచ్చే బీమా మొత్తాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు.

ఇందుకు కావాల్సిన అర్హతలు:

 • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/- కంటే తక్కువ ఉండాలి.
 • మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
 • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై వుండకూడదు.
 • కుటుంబమంతా కలసి నివసిస్తున్న ఇళ్ళు ( సొంతం/అద్దె) యొక్క నెలవారి విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లోపే ఉండాలి. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండాలి)
 • పట్టణ ప్రాంతంలో స్వంత గృహ నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి
 • కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.
 • ఆధార్ కార్డు ఉండాలి
 • బియ్యం కార్డు/రేషన్ కార్డు ఉండాలి (ఒక కుటుంబం – ఒక లబ్ధి ప్రాతిపదిక)
 • 21 నుండి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, మత్స్యశాఖ నందు రిజిస్టర్ అయిన మరపడవలు మరియు తెప్పలపై సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఈ పధకానికి అర్హులు
 • మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి మర పడవలు మరియు యాంత్రిక పడవలకు డీజిల్ సబ్సిడీ పధకానికి అర్హత కలిగి ఉంటారు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

 • అర్హత కల్గిన వారు బియ్యం కార్డు/రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వారు వేట చేస్తున్నటువంటి పడవ/తెప్ప వివరములతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డ్ వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
 • దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 10,000/- ఒకసారి మంజూరు చేసే వైయస్ఆర్ మత్స్యకార భరోసా పధకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

లభ్ధిదారులకు కావాల్సిన సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కోసం ఉచితంగా కాల్ చేయాల్సిన టోల్-ఫ్రీ నంబర్ 1902