వైద్యుడి ఆరోగ్యానికి అండగా సీఎం జగన్

  • హైదరాబాద్‌ కిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అవుతున్న డాక్టర్‌ భాస్కర్‌రావు
  • అనేక మందికి కోవిడ్‌ చికిత్స అందించిన వైద్యుడు
  • చివరకు కోవిడ్‌ కోరలకు చిక్కి ప్రాణాపాయ స్ధితికి
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తయిన ఊపిరితిత్తుల ఆపరేషన్‌
  • 100 రోజుల పోరాటం తరువాత ఆరోగ్యంగా ఇంటికి

  కోవిడ్‌ నుండి అనేక మంది ప్రాణాలను కాపాడిన వైద్యాధికారి అదే వైరస్‌ కోరలకు చిక్కి ప్రాణాపాయ స్ధితికి చేరుకున్నారు. ఆయన వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సహకారం అందించడంతో మృత్యుంజయుడై ఇంటికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ నర్తు భాస్కరరావు 5,000కు పైగా కోవిడ్‌ పరీక్షలు చేశారు. కోవిడ్‌ రోగులకు వైద్య సేవలందించారు.

  ఏప్రిల్‌ 24న ఆయన ఆదే కోవిడ్‌ కోరలకు చిక్కారు. కొన్ని రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. పరిస్ధితి విషమించడంతో మే 1న విజయవాడకు, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయన ఊపిరితిత్తులు చెడిపోయాయని, వాటిని మార్పిడి చేయాల్సిందేనని, అందుకు రూ. 2 కోట్లు వరకు ఖర్చవుతుందని హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

  ఆయన భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి అభ్యర్ధన మేరకు గ్రామానికి చెందిన ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు సుమారు రూ. 40 లక్షల వరకు సమకూర్చారు. ఇంకా రూ 1.5 కోట్లు అవసరమయ్యాయి. ప్రభుత్వ వైద్యుల సంఘం విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్ధితిని వివరించింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విషయం తెలిపారు. డాక్టర్‌ భాస్కరరావు వైద్యానికి అయ్యే ఖర్చు ఎంత అయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వెంటనే ఆపరేషన్‌కు అవసరమైన నిధులు కూడా కేటాయించారు. దీంతో జూలై 14న భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. 100 రోజుల పాటు చికిత్స అనంతరం మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

  మరో రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే అక్కడి వైద్యులకు అందుబాటులో ఉంటారని డాక్టర్‌ భాగ్యలక్ష్మి తెలిపారు. పూర్తిగా కోలుకొని స్వస్థలానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తన ఆరోగ్యం కోసం సహకరించిన ప్రతి ఒక్కరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతారని ఆమె తెలిపారు. 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/andhra-pradesh-govt-dr-bhaskara-rao-discharged-after-lung-operation