వైద్య, విద్య రంగంలో నాడు–నేడు పనులపై సీఎం సమీక్ష

అపరిశుభ్రత వాతావరణం ఎక్కడా కనిపించకూడదు

సెప్టెంబర్‌ నాటికి వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పూర్తిచేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై సీఎం సమీక్ష

వైద్యం, విద్యారంగంలో నాడు–నేడు పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాడు – నేడు పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి, నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని సూచించారు. పాఠశాలల నిర్వహణపైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నాడు–నేడు పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై సీఎం సమీక్షించారు. వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. సెప్టెంబర్‌ నాటికి వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. వచ్చే అక్టోబర్‌ నాటికి నూతన పీహెచ్‌సీల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, తదితర పనులపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. మార్చి నెలాఖరుకు వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించిన భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.