వైయస్ఆర్ జలకళ నిబంధనల్లో మార్పులు

వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబంలో నుండి ఒక రైతు మాత్రమే అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది.  ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలని వాల్టా చట్టం నిబంధన ప్రకారం బోరుల వేస్తున్నారు.ఈ పథకం అర్హత నిబంధనలలో సవరణలు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జలకళ అర్హత నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దీనిపై పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నూతనంగా సవరించిన జలకళ పధకం:
ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్‌ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్‌ సర్వే జరిపించాలి. ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది.వైఎస్సార్‌ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఇందులో ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.