చేనేత కుటుంబాలకు అండగా వైస్సార్ నేతన్న నేస్తం పంపిణీ

కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’  ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. కోవిడ్‌-19 కారణంగా 6 నెలల ముందుగానే ప్రభుత్వం సాయం అందించడం విశేషం. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ లబ్దిదారులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

‘నా పాదయాత్రలో చేనేతల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. వారందరికీ తోడుగా ఉంటానని వారికి మాట ఇచ్చాను . ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కొ ప్రఖ్యాతి గాంచిన చేనేత పరిశ్రమ ఉన్నా కూడా, మార్కెటింగ్‌ సరిగా లేక, ముడిసరుకుల ధరలు ఎక్కువగా ఉండడం, ఎలా బ్రతకాలో అర్థంకాని పరిస్థితి వారిది.  గత ఏడాది నా పుట్టినరోజున డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మళ్లీ ఈ ఏడాది కూడా అదే రోజున ప్రారంభిద్దామనుకున్నాం. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి, అంతవరకూ వేచి చూడ్డం ఇష్టంలేక ఇప్పడే ఇస్తున్నాం. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు ఇస్తామని చెప్పాం. ఈ మాట నెరవేరుస్తూ వైయస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడిదయతో, మీ అందరి ఆశీర్వాదాలతో అడుగు ముందుకు వేస్తున్నాం.

గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ఎంత ఇచ్చారంటే.. కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. అలాంటిది ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత ఇస్తున్నామో చూడండి. గత ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ. 200 కోట్లు సుమారుగా ఇస్తే.. ఇవాళ రూ. 406 కోట్లకు పైగా ఇస్తున్నాం. ఆప్కోకు గత ప్రభుత్వం పెట్టిన రూ.103 కోట్లతో పాటు, రెండో ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తకోసం మరో రూ.200 కోట్లు సుమారుగా ఇస్తున్నాం. కరోనా నివారణా చర్యల్లో భాగంగా ఆప్కోనుంచి బట్టను మాస్కుల తయారీకి కొన్నాం. దీనికోసం రూ. 109 కోట్లు ఇవాళే ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పథకాలు చూస్తే.. నేనే ఆపేర్లు మిస్‌ అవుతానామో అనిపిస్తుంది.

రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు సుమారు రూ.60లక్షల మందికి ఇస్తున్నాం. పేదవాడి బతుకులు మార్చే విధంగా ఇంగ్లీషు మీడియం తెస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తూ నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో చట్టాలే తీసుకువచ్చాం . కేబినెట్‌లోనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60శాతం మంత్రి పదవులు ఇచ్చాం . ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. 3.89 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.40వేల కోట్లకుపైగా ఇచ్చాం. ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా.. వారి చేతికే ఇవ్వగలుగుతున్నాం. గ్రామస్థాయి నుంచి గొప్ప మార్పులు తీసుకు రాగలిగాం. ఈ 13 నెలల్లోనే ఇవన్నీ చేయగలిగాం అంటే దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇది సాధ్యమయింది. ఈ లబ్ధిదారుల జాబితా, ఎంపికకు సంబంధించి దాదాపు 80వేల కుటుంబాలకు ఇవాళ మంచి జరుగనుంది.

గ్రామ వాలంటీర్లు సర్వేచేసి లబ్ధిదారులను గుర్తించి గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ కోసం ఒక జాబితాను పెట్టాం. ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలో వివరాలు కూడా అక్కడ పెట్టాం. ఇంకా నెలరోజుల సమయం ఉంది.  ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపించే ప్రభుత్వం మనది. పథకాన్ని ఎగరగొట్టాలనే ఆలోచన చేసే ప్రభుత్వం మనది కాదు. అర్హత ఉండి.. మీపేరు జాబితాలో లేకపోతే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి. వెంటనే పరిశీలించి మళ్లీ వచ్చే నెల ఇదే తేదీలోగా మిగిలిపోయిన వారు ఉంటే వారికి కూడా మంచి చేస్తాం. ఏవైనా సందేహాలుంటే 1902 అనే నంబర్‌కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.’ అంటూ తెలిపారు.