వ్యవసాయ రంగంలో పురోగతి

  గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి సర్కారులా రైతులకు మేలు చేయలేదని.. సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు రైతు ప్రభుత్వమని పలువురు వ్యక్తులు కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏళ్ల తరబడి పరిహారం అందేది కాదని.. కానీ, ఇప్పుడు సకాలంలో వస్తోందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని.. ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు రైతులకు గొప్ప మేలు చేస్తున్నాయని వారన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఓపెన్‌ మైండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ‘వ్యవసాయ రంగం పురోగతి’ అంశంపై శుక్రవారం వర్చువల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ వైస్‌ ఛాన్సలర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.  

  రైతులకు ఎంతో మేలు 
  సీఎం జగన్‌ రైతుల బాగోగులు తెలుసుకునేలా స్వయంగా వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటుచేశారు. ఆయన నిర్ణయాలు రైతులకు ఎంతగా మేలు చేస్తున్నాయి. గ్రామ వలంటీర్ల వ్యవస్థ రైతులకు ఎంతో మేలు చేస్తోంది. రైతులకు ఏ సమస్య వచ్చినా సర్కారు స్పందిస్తున్న తీరుతో ప్రభుత్వంపట్ల రైతుల్లో విశ్వాసం పెరుగుతోంది. 
  – డాక్టర్‌ ఏ.పద్మరాజు, ఆచార్య ఎన్‌జి రంగా వర్శిటి మాజీ వైస్‌ ఛాన్సలర్‌  

  రైతులకు సీఎం ప్రాధాన్యత  
  వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా రూ.13, 500లను మూడు విడతలుగా రైతులకు  ప్రభు త్వం అందిస్తోంది.  రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ జలకళ కింద రైతులకు ఉచితంగా రెండు లక్షల బోర్లు వేయిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాలో రైతుల వాటా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. మత్స్యకార భరోసా, రూ.1,700 కోట్లతో పగటిపూట వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ వంటివి ఇవ్వటంతో పాటు రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటుచేశారు. ఇవన్నీ వైఎస్‌ జగన్‌ రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.  
      – గంగిరెడ్డి, ఓపెన్‌ మైండ్స్‌ సంస్థ అధ్యక్షుడు

  సాగును పండుగలా మార్చారు 
  గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సీఎం జగన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. అదే రీతిలో సీఎం జగన్‌ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడంవల్ల గత రెండేళ్లలో 2 లక్షల హెక్టార్ల భూమిని కొత్తగా సాగులోకి తెచ్చారు. వ్యవసాయానికి సంబంధించి మన రాష్ట్రంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది.  
  – డాక్టర్‌ చెంగారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త 

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/speakers-virtual-conference-progress-agricultural-sector-1370567