నిర్వాసితుల పునరావాసానికి శరవేగంగా ఏర్పాట్లు

  • పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు  అధిక ప్రాధాన్యం 
  • దేవీపట్నం,పూడిపల్లి మినహా గ్రామాలకు పూర్తయిన ఏర్పాట్లు
  • ముంపు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేసిన నిర్వాసితులు

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం రెండు కళ్లుగా భావించి రెండింటికి ప్రాధాన్యం ఇస్తూ పునరావాసం పనులు వేగవంతం చేసింది.దేవీపట్నం, పూడిపల్లి మినహా గ్రామాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో పడకేయగా ప్రస్తుత ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది.

రంపచోడవరం: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పునరావాస కాలనీల నిర్మాణం దగ్గర నుంచి నిర్వాసితుల ఖాతాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ డబ్బులు జమ, నిర్వాసితులు గ్రామాల నుంచి తరలింపు వంటి పనులు ముమ్మరం చేసింది.  

ముంపు గ్రామాల్లో.. 
దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ ( రీహేబిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌) అధికారులు 5618 మందిని పీడీఎఫ్‌ (ప్రాజెక్టు డిప్లేస్‌మెంట్‌ ఫ్యామిలీస్‌)గా గుర్తించారు. అలాగే రెండు, మూడు సర్వేల్లో మరి కొంత మందిని పోలవరం నిర్వాసితులుగా గుర్తించారు. 

నిర్వాసితుల తరలింపు 
దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.  అధికారులు వీటిని ఖాళీ చేయించి నిర్వాసితులు బయటకు తరలించారు.  42 గ్రామాలకు పునరావాస పనులు పూర్తి చేసి వారిని కాలనీల్లోకి తరలించారు. దేవీపట్నం, పూడిపల్లి గ్రామాలకు పునరావాసం పూర్తయితే దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న వారికి నూరుశాతం పునరావాసం కల్పించినట్లే.  

గోకవరం గ్రామ శివారులో.. దేవీపట్నం గ్రామ నిర్వాసితులకు మైదాన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం గ్రామ శివారు రాజమహేంద్రవరం వెళ్లే రహదారిలో కాలనీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేలను చదును చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీలోని గిరిజనులు పలు డిమాండ్ల కారణంగా గ్రామాలను ఖాళీ చేయలేదు. ఇటీవల కాలంలో అధికారులు వారితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో ఆ పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాల గిరిజనులు గంగవరం మండలం నేలదొనెలపాడులో నిర్మించిన పునరావాస కాలనీలకు తరలివెళ్లారు.  

ఎనిమిది గ్రామాల నుంచి.. 
కొండమొదలు గ్రామంలో 23 కుటుంబాలు, మెట్టగూడెంలో 18, తాటివాడలో 38,  కొక్కెరగూడెంలో 77,  నడిపూడిలో 35, తెలిపేరులో 40,  సోమర్లపాడులో 52, పెద్దగూడెంలో 75 కుటుంబాలు పునరావాస కాలనీలకు తరలివెళ్లాయి. దేవీపట్నం నిర్వాసితులకు గోకవరం గ్రామశివారులో 670 మందికి స్థల సేకరణ చేశారు. కొన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మండలంలోని గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం మండలంలోని ఇందుకూరు–1, ఇందుకూరు–2, పోతవరం ,బియ్యంపల్లి, కమలపాలెం , తదితర గ్రామాల్లో ఏడు కాలనీలు నిర్మించారు. 

3029 మంది నిర్వాసితులకు.. 
పీడీఎఫ్‌ (ప్రాజెక్టు డిప్లేస్‌మెంట్‌ ఫ్యామిలీస్‌)లు 5618 మంది ఉంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3029 నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో దఫా కూడా నిర్వాసితులకు డబ్బులు జమ చేశారు.సుమారు 1200 మంది ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది.

Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/accelerate-and-rehabilitation-polavaram-project-construction-1456574