శాస్త్రీయ పద్ధతుల్లో జీవాల పెంపకం

  • లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వ చొరవ 
  • కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రం  
  • సెప్టెంబర్‌ 1 నుంచి శిక్షణ తరగతులు  

  గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్యాపిలి మండలంలోని హుసేనాపురంలో పదెకరాల్లో శిక్షణ కేంద్రం భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది.

  భవనాలు పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా డోన్‌ పట్టణంలోని పశుసంవర్థక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారు. విశాఖలోని స్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైవ్‌ స్టాక్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్‌ ప్రకారం శిక్షణ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్లకు పైగా జీవాలుండగా, రాయలసీమ జిల్లాల్లోనే కోటి వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విత్తనపు పొట్టేళ్ల ఎంపిక, టీకాలు వేయించడం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తారు.  

  వచ్చే నెల 1 నుంచి మూడు రోజుల పాటు..  
  సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి శిక్షణ తరగతులుంటాయి. గొర్రెల పెంపకందారులను బ్యాచ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కరోజు అనంతపురం జిల్లాలోని గొర్రెల ఫామ్‌కు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు.    

  గొర్రెల పెంపకందారులకు అదృష్టమే 
  శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. మాకు 200 గొర్రెలున్నాయి. వీటిని పెంచడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తే.. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది.  
  – పరమేష్, గొర్రెల పెంపకందారు, యు.కొత్తపల్లి, డోన్‌ మండలం

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/breeding-now-longer-scientific-1388671