ఏపీ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ స్పష్టం చేశారు. ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో శిక్షణ ఇస్తాం. గ్రామీణ, డెస్క్ విలేకరులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. జర్నలిస్టులు ఎన్నో విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో కష్టపడి పని చేసినా ఫలితం లేదనే భావన ఉంది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం.. త్వరలో మంచి జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారు.

శిక్షణ కోసం అనేక ప్లాట్ ఫామ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అన్ని శాఖలను ఒక చోట చేర్చి సమాచారం అందించేలా చర్యలు చేపడుతున్నాం. కోవిడ్ సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు. అందుకే ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తొలుత విశాఖ నుంచి ప్రారంభిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా శిక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడెమీ కృషి చేస్తుంది. వారి శిక్షణ కోసం యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. జర్నలిస్టులందరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.

ఫేక్ న్యూస్ నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. అటువంటి వార్తల పట్ల ఎలా అప్రమత్తత ఉండాలో కూడా శిక్షణలో భాగంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్లేలా కూడా బాధ్యత తీసుకుంటున్నాం. వర్కింగ్ జర్నలిస్టులు జర్నలిజంలో ఏదయినా కోర్స్ చేయాలి అనుకుంటే ప్రెస్ అకాడమీ సహకరిస్తుంది. ప్రతి జర్నలిస్ట్ వెనుక ప్రెస్ అకాడెమీ ఉంటుందని గుర్తుంచుకోండి’ అని దేవిరెడ్డి శ్రీనాథ్‌ పేర్కొన్నారు.

https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/devireddy-srinath-clarified-state-government-committed-welfare