సంక్షేమం ఫలించింది.. అప్పుల బాధ తప్పింది

   

  • ప్రభుత్వ పథకాల అమలుతో ప్రైవేట్‌ అప్పులకు దూరంగా పేదలు 
  • పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులకు గతంలో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులే ఆధారం 
  • ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా పేదల వద్దే తగినంత నగదు 
  • గ్రామాల్లో మారిన ఆర్థిక స్థితిగతులు 

  బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తే.. అంతకంటే ముందే గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద చేయి చాచాల్సి వచ్చేది. ఒక్కోసారి ఇంటికి బంధువులొచ్చినా వడ్డీ వ్యాపారిని ఆశ్రయించక తప్పేది కాదు. ఇంట్లో ఏదైనా చిన్నపాటి కార్యక్రమం నిర్వహించాల్సి వస్తే తప్పనిసరిగా అప్పు చేయాల్సిందే. సుమారు రెండేళ్ల క్రితం వరకూ పేద, మధ్య తరగతి కుటుంబాల దుస్థితి ఇది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో 22 నెలలుగా పెద్దఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలకు నూతన జవసత్వాలను చేకూర్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వ్యవసాయ పెట్టుబడుల నుంచి పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల వైద్యం కోసం.. రోజువారీ అవసరాల కోసం గ్రామీణ కుటుంబాలు ధనవంతులు, వడ్డీ వ్యాపారుల వద్దకు అప్పుల కోసం వెళ్లాల్సి వచ్చేది.

  ఇప్పుడు అత్యధిక కుటుంబాలకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులు అందుతుండటంతో ఆ కుటుంబాలు అప్పులు తీసుకోవాల్సిన అవసరం బాగా తగ్గిపోయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 22 నెలల కాలంలో వివిధ పథకాల కింద దాదాపు రూ.లక్ష కోట్లను పేదలకు నేరుగా నగదు రూపంలో పంపిణీ చేసింది. దీంతో ఆయా కుటుంబాల వద్ద రోజువారీ అవసరాలకు వారికి సరిపడనంత సొమ్ములు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారాలు బాగా తగ్గుముఖం పట్టాయి. పెద్దపెద్ద అవసరాలు వచ్చినప్పుడు.. అదీ అతి తక్కువ సందర్భాలలో మాత్రమే పేద కుటుంబాలు ధనవంతుల వద్ద అప్పుకు వెళ్లే పరిస్థితి.

  ఏళ్ల తరబడి రూ.2 వడ్డీకి.. 
  గ్రామాల్లో వడ్డీ వ్యాపారులు ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే రూ.వందకు ప్రతి నెలా రూ. 2 చొప్పున వడ్డీ వసూలు చేసేవారు. 50–60 ఏళ్లుగా ఇదే వడ్డీ రేటుకు అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం కొనసాగుతోంది. ఇప్పుడు అడపాదడపా ఎవరైనా అప్పు చేయాల్సి వస్తే.. రూపాయి లేదా రూపాయిన్నర వడ్డీకి ఇస్తారా అని డిమాండ్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రూ.2 వడ్డీకి కూడా అప్పులు ఇచ్చేవారు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు రూపాయి, రూపాయిన్నర వడ్డీకైనా అప్పు తీసుకునే వారి కోసం వ్యాపారులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో అప్పులు తీసుకునే వారు తగ్గిపోవడంతో వడ్డీ వ్యాపారులు ఇప్పుడు తమ వద్ద ఉన్న డబ్బులను వేరే మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. గ్రామంలో ఎక్కువ స్థలంలో సొంత ఇల్లు ఉన్నా.. డబ్బులు ఊరికే ఉంచుకోలేక కొత్తగా ఇళ్ల స్థలాలను కొంటున్నారు.

  ఉదాహరణకు గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో 3 నెలల కిత్రం ఒక రైతు ప్రధాన రహదారి పక్కన తనకున్న 1.70 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ల ప్లాట్లుగా వర్గీకరించి వెంచర్‌ వేయగా.. గతంలో గ్రామంలో పేదలకు ఎక్కువగా అప్పులు ఇచ్చే పది మంది వడ్డీ వ్యాపారులే ఒక్కొక్కరు మూడు నాలుగు ప్లాట్ల చొప్పున కొనుగోలు చేశారు. దాదాపు 5,500 జనాభా ఉండే ఆ గ్రామంలో ఏడాదిన్నర కాలంలో మూడు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు ఆ గ్రామంలో రూ. 20 వేల లోపు అప్పు అవసరం పడే కుటుంబాలు పదిలోపే ఉంటాయని గ్రామస్తుడొకరు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.

  గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది
  ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలను ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తుండటంతో గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన మాట వాస్తవం. అప్పు ఇచ్చిపుచ్చుకోవడంలో మధ్యవర్తుల ప్రమేయం బాగా తగ్గిపోయింది. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలను కలగలిపిన ఉపాధి మార్గాలను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవడం ద్వారా గ్రామాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన పెరిగి గ్రామీణ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.  
  – ప్రొఫెసర్‌ ఎం.ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, ఆంధ్రా యూనివర్సిటీ   

  Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/poor-people-away-private-debt-implementation-govt-schemes-1360591