ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చేపట్టిన పలు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. వివిధ సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ను ప్రకటించి ఒక నూతన సంప్రదాయానికి నాంది పలికింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ ఎక్కడా లోటు కనబడనీయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ నెలలవారీగా పథకాలను అమలు చేసే ప్రణాళికను ప్రకటించింది. ఇందుకు సంబంధించి GO (Planning Dept.) Rt. No. 54ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లైంది. అలాగే లబ్ధిదారులకు కూడా ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో ఈ క్యాలెండర్‌తో తెలుస్తుంది. అంతేకాకుండా సంక్షేమ పథకాల తాలూకు బడ్జెట్ కేటాయింపులను సైతం మంత్రివర్గం ఆమోదించింది. ఆర్థిక సమస్యలతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల అమలుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏపీలో 5,08,08,220 మందికి ప్రయోజనం చేకూరుతోంది. నెలవారీ పింఛన్లతో కలిపి చూస్తే మొత్తం ఈ లబ్ధిదారుల సంఖ్య 5,69,81,184.

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రచురించిన 2021–2022 క్యాలెండర్లో కూడా ప్రభుత్వం ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు అవుతాయో వివరంగా తెలియజేసింది. ఈ క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలు ఉండగా, రెండో పేజీలో (గత 22 నెలల కాలంలో) 2019 జూన్ నుంచి 2021 ఏడాది మార్చి వరకు ఏయే పథకాలతో ఎంత మందికి, ఎన్ని కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగిందో వివరించారు. మూడో పేజీలో అవ్వాతాతలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా పింఛను కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరసగా ఏ నెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది తెలిపారు.
23 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ వివరాలు ఇలా ఉన్నాయి.
నెలలవారీగా పథకాలు, కార్యక్రమాలు:
ఏప్రిల్–2021: జగనన్న వసతి దీవెన మొదటి విడత. జగనన్న విద్యా దీవెన మొదటి విడత. రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ (2019-రబీ). పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు.
మే–2021: వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా (2020- ఖరీఫ్). వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత. మత్స్యకార భరోసా (వేట నిషేధం సబ్సిడీ). మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
జూన్–2021: వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యాకానుక.
జూలై–2021: జగనన్న విద్యాదీవెన రెండో విడత. వైయస్సార్ కాపు నేస్తం. వైఎస్ఆర్ వాహనమిత్ర.
ఆగస్టు–2021: రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020-ఖరీఫ్), ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు.
సెప్టెంబరు–2021: వైఎస్సార్ ఆసరా
అక్టోబరు–2021: వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత. జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయి బ్రాహ్మణులు). జగనన్న తోడు (చిరు వ్యాపారులు).
నవంబరు–2021: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం.
డిసెంబరు–2021: జగనన్న వసతి దీవెన రెండో విడత. జగనన్న విద్యాదీవెన మూడో విడత. వైఎస్ఆర్ లా నేస్తం.
జనవరి–2022: వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత. జగనన్న అమ్మ ఒడి. పెన్షన్ పెంపు. ఇక నుంచి నెలకు రూ.2500.
ఫిబ్రవరి–2022: జగనన్న విద్యాదీవెన నాలుగో విడత.
వీటితో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి రెగ్యులర్ పథకాలు కూడా అమలు అవుతాయి.

ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు-
జగనన్న వసతి దీవెన పథకం కింద 15లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు జరుగుతోంది. జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు విడతలుగా ( ఏప్రిల్-జూలై-డిసెంబర్-ఫిబ్రవరి) సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు. 18లక్షల 80వేల మందికి లబ్ధి చేకూరుతోంది. రైతులకు వడ్డీలేని రుణాలు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 66.11 లక్షల మందికి వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. అలాగే 90.37లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నారు. పంటల బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు బీమా చెల్లింపు జరుగుతోంది. రైతు భరోసా పథకం కింద మూడు దఫాలుగా ( మే-అక్టోబర్-జనవరి) 54 లక్షల మందికి రైతులకు లబ్ధి. మత్స్యకార భరోసా కింద 1.09 లక్షల మందికి ఆర్ధిక సాయం. మత్స్యకార భరోసా పథకం కింద 19వేల పడవలకు డీజిల్ సబ్సిడీ. జగనన్న విద్యాకానుక పథకం కింద 42 లక్షల మందికి బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 24 లక్షల మందికి రూ.17,250 చొప్పున ఆర్ధిక సాయం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పథకం కింద 2 లక్షల మందికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 3.27లక్షల మందికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం. 25 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు. 9వేల ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు.
నేతన్న నేస్తం పథకం కింద 81వేల మందికి ఆర్థిక సహాయం. 3లక్షల 34వేల మంది మంది అగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లింపులు. జగనన్న తోడు పథకం కింద 9.05లక్షల మందికి సాయం. జగనన్న చేదోడు పథకం కింద టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం మొత్తం 2.95లక్షల మందికి లబ్ధి. ఇక అగ్రవర్ణాల పేద మహిళలకు ఈసీబీ నేస్తం పథకం కింద రూ.15వేలు ఆర్ధిక సాయం. లబ్ధిదారులు సుమారు 6 లక్షలు. కాగా, జగనన్న అమ్మఒడి పథకం కింద 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం అందుతోంది.
ఇతర సంక్షేమ కార్యక్రమాలు
అలాగే వైఎస్ఆర్ లా నేస్తం (YSR Law Nestham) కింద దాదాపు 2,012 మందికి ప్రతి నెలా లబ్ధి చేకూరుతోంది. ‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం చెల్లింపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 జూన్ వరకు నిధులు కూడా విడుదల చేసింది. అలాగే జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 36,88,618 మందికి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 30,16,000 మందికి, ఇమామ్, మౌజమ్‌లకు ఆర్థిక సహాయం కింద 77,290 మందికి ప్రయోజనం చేకూరుతోంది. అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ఇంటికే రేషన్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశంలో ఇంత పెద్ద యెత్తున, క్యాలెండర్ ప్రకటించి మరీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికీ ఒకటికి మించి పథకాలను అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.